దీపావళి సెలవులకు వచ్చి..
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడు గ్రామానికి చెందిన గన్నమనేని ధాత్రి (27) మృతి చెందింది. ధాత్రి స్వగ్రామం యద్దనపూడి మండలం పూనూరు కాగా, ప్రస్తుతం ఇంకొల్లు మండలం పూసపాడులోని అమ్మమ్మ ఊరిలో ఉంటున్నారు. ధాత్రి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇటీవల దీపావళి సెలవులకు హైదరాబాదులో బంధువుల ఇంటికి వెళ్లింది. హైదరాబాద్ లో తన మేనమామ దగ్గరికి వెళ్లిన ధాత్రి అక్కడే ట్రావెల్స్ బస్సు ఎక్కింది.
అక్కడ నుండి బెంగుళూరుకు కావేరి బస్సులో బయలు దేరి ఈ ప్రమాదంలో సజీవ దహనమైంది. ఈ సమాచారంతో బంధువులు పూసపాడు నుండి హుటాహుటిన కర్నూలు బయలు దేరారు. దీంతో గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. ధాత్రి మృతిపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. ఇదే దుర్ఘటనలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్త కొండూరుకు చెందిన మరో సాప్ట్ వేర్ ఇంజనీర్ దుర్మరణం చెందింది. దీపావళి పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు బంధువుల ఇంటికి వెళ్లిన అనూష రెడ్డి గురువారం రాత్రి భరత్ నగర్ లో ఈ బస్సు ఎక్కింది. ఈ దుర్ఘటనలో సజీవదహనమైంది.

