కలర్ కోడింగ్ బ్యాగులు తప్పనిసరి..

- శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించిన ఆయన, రోగులు, సిబ్బంది, ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా వ్యర్థాలను సక్రమంగా వేరు చేసి శాస్త్రీయ పద్ధతిలో నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆసుపత్రులు రెడ్, ఎల్లో, బ్లూ, వైట్ రంగుల కోడింగ్ బ్యాగులు ఉపయోగించి ఇంజక్షన్ సూదులు, పత్తి, గ్లౌవ్స్, శరీర వ్యర్థాలు వంటి బయోమెడికల్ వ్యర్థాలను తప్పనిసరిగా వేరు చేయాలని సూచించారు. ముఖ్యంగా, కాలం చెల్లిన మందులను సాధారణ చెత్తతో కలిపి పారబోయడం వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.
అంతేకాక, ప్రతి ఆసుపత్రి, క్లినిక్, ల్యాబ్ తమ వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాల వివరాలను బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యాప్‌లో ప్రతిరోజూ తప్పనిసరిగా ఎంట్రీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. డేటా ఎంట్రీ చేయని సంస్థలపై కాలుష్య నియంత్రణ మండలి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ‘చెత్తను వేరు చేసే ముందు ఆలోచించండి’ అనే గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. కరుణశ్రీ, డిఎంహెచ్వో అనిత, డి సి హెచ్ ఎస్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
