Flamingo Festival | ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష..

Flamingo Festival | ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష..
తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): పులికాట్ సరస్సు పరిసర ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్‌ను మరింత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలంటూ కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతి కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పర్యాటక మండలి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2026 జనవరిలో జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్‌కు సంబంధించి మైక్రో ప్లాన్ త్వరితగతిన సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
ఫారెస్ట్, పర్యాటక, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖలతో కలిసి పులికాట్, నేలపట్టు ప్రాంతాల్లో అవసరమైన వేదికలు, పర్యాటక సదుపాయాలు, ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించిన తేదీలు, కార్యక్రమాల అమలు విధానం వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఫెస్టివల్ ప్రచారార్థం ప్రత్యేక ప్రోమోషనల్ వీడియో టీజర్‌ను తయారు చేసి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
ఫ్లెమింగో ఫెస్టివల్‌ను రాష్ట్ర స్థాయి ప్రధాన పర్యాటక ఉత్సవంగా నిలబెట్టే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని, విభాగాలవారీగా కార్యాచరణ ప్రణాళికలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశానికి పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, ఆర్డీవో కిరణ్మయి, అటవీ శాఖ అధికారులు సాయిబాబా, హారిక, జూ క్యూరేటర్ సెల్వం, రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్‌తో పాటు సంబంధిత మండలాల తహసీల్దారులు, వ్యవసాయ, ఫిషరీస్, డీఆర్‌డీఏ అధికారులు హాజరయ్యారు.
