కర్నూలు బ్యూరో: కర్నూలు జిల్లా, సి.బెళగల్ మండలం, పోలకల్ గ్రామంలో చెట్టు విరిగి విద్యార్థినిపై పడిన ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీలేఖపై చెట్టు విరిగిపడడంతో గాయాలై కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అడ్మిట్ చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 6గంటలకు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినిని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పరామర్శించారు.
విద్యార్థినికి మెరుగైన వైద్య సేవలు అందజేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యులను ఆదేశించారు. ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ ధైర్యం చెప్పారు. పోలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్కూలు ఆవరణంలో మీటింగ్ జరుగుతుండగా హఠాత్తుగా పక్కన ఉన్న చెట్టు కూలిపోయి విద్యార్థుల మీద పడడంతో 8వ తరగతి చదువుతున్న శ్రీలేఖ అనే విద్యార్థిని నడుముకు గాయాలు కాగా, మరో 6మందికి చిన్నపాటి గాయాలయ్యాయి. నడుముకు దెబ్బ తగిలిన విద్యార్థినిని అంబులెన్స్ లో గ్రామంలో ఉన్న పి హెచ్ సి కి తరలించి, అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించి, కర్నూలు జనరల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.
ఈసందర్భంగా కలెక్టర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉన్న విద్యార్థినిని పరామర్శించారు.. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి మెరుగైన వైద్య సేవలు అందజేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ వైద్యులను ఆదేశించారు. తల్లిదండ్రులతో మాట్లాడి, ఆందోళన చెందవద్దని, విద్యార్థినికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, సంబంధిత విభాగాల వైద్యులున్నారు.