భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : బాల్య వివాహాల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లాలో మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాల కార్యక్రమాల అమలుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి వారి స్వతంత్రులుగా జీవించే విధంగా తీర్చిదిద్దేందుకు పిల్లల సంరక్షణ సంస్థలు లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ రోజు 12 బాలల సంరక్షణ సంస్థలకు లైసెన్స్ పత్రాలను మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఈ సంస్థల్లో 654 మంది పిల్లలు ఆశ్రయం పొంది విద్యను అభ్యసిస్తున్నారు అన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు వారి సమీప బంధువులు సంరక్షణలో ఉంటారని అటువంటి వారిని గుర్తించి వారిని సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా చూడవలసిన బాధ్యత మనపై ఉందన్నారు.
కొంతమంది తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్తూ వారిపిల్లలను దగ్గర బంధువుల వద్ద ఉంచుతున్నారని, ఆ పిల్లలకు తగినంత రక్షణ లేకపోవడం వల్ల వ్యసనాల బారిన పడుతున్నారన్నారు. ఇటువంటి వారిని గుర్తించి సరైన మార్గంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
పిల్లలు లేని దంపతులు పిల్లలను దత్తత తీసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. బాల్య వివాహాల నిరోధానికి గ్రామాలలో, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గృహహింస, లైంగిక వేధింపులు, బాలల అక్రమ రవాణా వంటి హింసకు గురైన మహిళలకు సమగ్ర సేవలు అందించడానికి మిషన్ శక్తి కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2015 లో వన్ స్టాప్ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందన్నారు.
ఈ కేంద్రంలో న్యాయవాదులు, కౌన్సిలర్స్, వైద్య నిపుణులు ఉంటారని, వీరు మహిళ బాధితులకు వివిధ రకాల సేవలు అందిస్తారన్నారు. బాధిత మహిళలకు నైపుణ్య శిక్షణ అందించి జీవనోపాధి కల్పించేందుకు చర్య తీసుకుంటారన్నారు. మహిళల, పిల్లల హక్కుల చట్టాలపై అవగాహన కలిగించేందుకు మండల స్థాయి, పాఠశాలల్లో 53 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. మహిళలు ఆపద సమయంలో 181 హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేస్తే తక్షణమే రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి డి.శ్రీలక్ష్మి, జిల్లా చైల్డ్ ప్రొడక్షన్ అధికారి ఆర్.రాజేష్, జిల్లా వైద్య శాఖ అధికారి జి.గీతా బాయి, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్.వి అరుణ కుమారి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎ.నాగేంద్రప్రసాద్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ఏ.రాంబాబు, చైల్డ్ కేర్ సంస్థల ప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

