ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన కలెక్టర్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ (Collector Sumit Kumar) వెల్లడించారు. బుధవారం జిల్లా సచివాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ లను తనిఖీ చేసి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) ముందస్తు చర్యల్లో భాగంగా 2002 ఓటరు జాబితాతో 2025 ఓటరు జాబితాను సరిపోల్చే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ జిల్లాలో సెప్టెంబర్ 19 నుండి 26 వ తేది వరకు కొనసాగుతుందని, ఇప్పటి వరకు 25 శాతం జాబితా సరిపోలిందని, ఈ ప్రక్రియ నిర్వహణలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా (Voter list) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్, మరణించిన వారిని జాబితా నుండి తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించవచ్చన్నారు.
జిల్లాలో 1776 పోలింగ్ స్టేషన్ ల పరిధిలో బీఎల్ఓ లకు ఈ ప్రక్రియ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, రాజకీయ పార్టీ ప్రతినిధులు (Political party representatives) తమ బీఎల్ఏ ద్వారా పరిశీలించవచ్చునని తెలిపారు. దీంతో పాటు రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ దృష్టికి వచ్చిన బోగస్, మరణించిన వారి వివరాలను బీఎల్ఓలకు తెలిపి ఓటరు జాబితా నుండి తొలగించే కార్యక్రమానికి సహకరించాలని కోరారు. 18 ఏళ్ల వయసు పూర్తి చేసి నూతనంగా ఓటరుగా నమోదు చేసే ప్రక్రియ సంతృప్తికరంగా కొనసాగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రతినిధి సురేంద్ర కుమార్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పరదేశి, బీజేపీ ప్రతినిధి అట్లూరి శ్రీనివాసులు, జనసేన పార్టీ ప్రతినిధి యశ్వంత్, సీపీఎం పార్టీ ప్రతినిధి గంగరాజు, ఎలెక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ రాజేంద్ర, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

