COLLECTOR | పెన్షన్ పంపిణీలో తేడా రావొద్దు
- ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవు
- జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి
COLLECTOR | కర్నూలు ప్రతినిధి. ఆంధ్రప్రభ : పెన్షన్ పంపిణీకి సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని కలెక్టర్ (collector) డా. ఏ. సిరి అధికారులను హెచ్చరించారు. శుక్రవారం మంత్రాలయం, ఆలూరు పత్తికొండ ఎమ్మిగనూరు నియోజకవర్గాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పెన్షన్ పంపిణీ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెన్షన్ (Pension) పంపిణీకి సంబంధించి కొన్నిచోట్ల ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం లేదని, డబ్బులు వసూలు చేస్తున్నారని, పంపిణీ సమయంలో సరిగా ప్రవర్తించడం లేదని ఐవీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇలాంటి ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాలకు వారంలో మూడు సార్లు ఎంపీడీఓలు, డీఆర్డీఏ పీడీ వెళ్ళి విచారించి, నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వచ్చేనెల నుంచి ఇలాంటి ఫిర్యాదులు రాకూడదని, వస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

ప్రతి నెల ఉదయం 7 గంటలకే పెన్షన్ పంపిణీ ని ప్రారంభించాలని, అవినీతికి తావు లేకుండా, ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని, పెన్షన్ దారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో, డీఆర్‌డీఏ పిడి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (Control Room) ఏర్పాటు చేసి, ర్యాండంగా లబ్ధిదారులకు ఫోన్‌చేసి ఫీడ్ బ్యాక్ సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు.
అలాగే అన్న క్యాంటీన్ లలో (Canteen) కూడా నాణ్యమైన భోజనాన్ని అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ లను ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్ లో జెడ్పీ సీఈవో నాసర రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రమణా రెడ్డి, మునిసిపల్ కమిషనర్ విశ్వనాథ తదితరులు పాల్గొన్నారు.

