Collector |శ్రీ ముఖలింగం ఉత్సవాలకు కంట్రోల్ రూమ్ నిఘా

Collector |శ్రీ ముఖలింగం ఉత్సవాలకు కంట్రోల్ రూమ్ నిఘా
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
Collector | శ్రీకాకుళం బ్యూరో, ఆంధ్రప్రభ: శ్రీముఖలింగ క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. ఉత్సవాల సమయంలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ కేంద్రంగా పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు. కంట్రోల్ రూమ్‌లో ప్రతి లైన్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. తమకు కేటాయించిన విభాగాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును వీరు నిరంతరం పర్యవేక్షిస్తుండాలని. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా, భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చినా వెనువెంటనే స్పందించాలని స్పష్టం చేశారు.
విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసులకు చెందిన ప్రతినిధులు కంట్రోల్ రూమ్‌లో ఉండి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తుల రద్దీని బట్టి క్యూలైన్ల క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా వచ్చే దృశ్యాలను కంట్రోల్ రూమ్ నుంచి నిశితంగా పరిశీలిస్తూ భద్రతను పటిష్టం చేయాలని ఏఎస్పీకి సూచించారు. వేడుకల్లో భాగంగా.. 18వ తేదీన జరిగే చక్రతీర్థ యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పార్కింగ్ స్థలాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మరోసారి హెచ్చరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఏఎస్పీ కేవీ రమణ, టెక్కలి డిఎస్పి లక్ష్మణరావు, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
