Collector | ఓటు హక్కు అత్యంత కీలకం

Collector | ఓటు హక్కు అత్యంత కీలకం

  • జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

Collector | కర్నూలు ప్రతినిధి, జనవరి : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు కలెక్టరేట్ లోని సునయ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన వీడియో సందేశాన్ని విన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టంగా నిర్వహించేందుకు 1950లో భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలలో ఓటు హక్కుపై అవగాహన పెంపొందించేందుకు 2011 సంవత్సరం జనవరి 25 నుండి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Collector

కర్నూలు జిల్లాలో ప్రస్తుతం మొత్తం 20 లక్షల 81 వేల ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుష ఓటర్లు 10 లక్షల 24 వేల మంది, మహిళా ఓటర్లు 10 లక్షల 56 వేల మంది, అలాగే సర్వీస్ ఓటర్లు 1,600 మంది ఉన్నారని వివరించారు.

ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశ ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించబడుతోందని, భారత ఎన్నికల సంఘం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహిస్తున్నదని కలెక్టర్ పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలలో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు సౌకర్యవంతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నూతన ఓటర్ల నమోదు కోసం ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా సౌకర్యం కల్పించడంతో పాటు, బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు ప్రక్రియను చేపడుతున్నారని తెలిపారు.

గతంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిర్వహించబడిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రస్తుతం ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నామని వివరించారు. ఎవరికి ఓటు వేశామన్న విషయం గోప్యంగా ఉంటుందని, ఎన్నికల సంఘం ఈ అంశంలో పారదర్శకతను మరింత పెంచేందుకు నిరంతరం చర్యలు చేపడుతోందని తెలిపారు.

Leave a Reply