Collector | స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన ..

Collector | ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : పరిశుభ్రత ముందుగా మన ఇంటి నుండే ప్రారంభం కావాలని, అప్పుడే గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం సంపూర్ణ పారిశుద్ధ్యం గా రూపొందుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక సత్రంపాడులోని 22వ డివిజన్ లో ఇంటింటికీ వెళ్లి పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంపై ప్రజలకు తెలియజేసారు.

జీరో గ్యాప్ శానిటేషన్ కార్యక్రమం గురించి ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. వారి ప్రాంతంలో పారిశుద్ధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, నగరపాలక పారిశుద్ధ్య సిబ్బంది ప్రతీ రోజు శుభ్రం చేస్తున్నారా, లేదా, ప్రతీ రోజూ ఇంటింటికి వచ్చి తడి, పొడి చెత్తలనుసేకరిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు.

ఇంటి పరిసరాలలో ఎటువంటి పారిశుద్ధ్య సమస్య ఉన్నా జీరో గ్యాప్ శానిటేషన్ పత్రాలలో సూచించిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయని, పర్యావరణానికి కీడు చేసే ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతీ ఒక్కరూ నియంత్రించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కలెక్టర్ వెంట ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ.భాను ప్రతాప్, తహసీల్దార్ గాయత్రి, నగరపాలక సంస్థ సిబ్బంది,ప్రభృతులు పాల్గొన్నారు.
