Collector | అమ్మలా… అక్కున చేర్చుకొని..
- మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌కు హాజరైన కలెక్టర్
Collector | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ: గుంటూరు స్టాల్ బాలికల పాఠశాలలో ఈ రోజు జరిగిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. ఒక అధికారిగా మాత్రమే కాకుండా, ఒక ‘అమ్మ’లా పిల్లలను అక్కున చేర్చుకుని, వారి చదువు, భావోద్వేగాలు, నైపుణ్యాల పురోగతిని తెలుసుకున్నారు. విద్యార్థులపై పూర్తి వివరాలు ఉన్న సంపూర్ణ ప్రగతి నివేదిక(Overall progress report) ఎలా సహాయపడుతుందనే విషయాన్ని ఉపాధ్యాయులతో మాట్లాడి తెలుసుకున్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 1049 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ తల్లిదండ్రుల సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. “ఒక తల్లిగా నా పిల్లల పురోగతి(progress) తెలుసుకోవడానికి వచ్చాను” అని చిన్నారులతో మాట్లాడుతూ.. ఆమె చెప్పిన మాటలు పిల్లల్లో ఉత్సాహం నింపాయి. విద్యలో ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త మార్పులు, ఫార్మేటివ్ అసెస్మెంట్లు(Formative assessments) విద్యార్థుల అభివృద్ధికి ఉపయోగపడతాయని వివరించారు.

డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, పోలీసులు, న్యాయవాదులు, కలెక్టర్లు కావాలనుకునే చిన్నారులను ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచే కలలు కనడం, లక్ష్యాన్ని కళ్ల ముందుంచుకోవడం చాలా అవసరమని వివరించారు. మైండ్‌కు ఉన్న శక్తిని నమ్మి ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్ అవకాశాల(Future opportunities)పై ఒక చార్ట్ తయారు చేసి పిల్లలకు అందిస్తామని కూడా తెలిపారు. సాధికారత వచ్చే వరకూ బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలని చెప్పారు. లైంగిక వేధింపుల(Sexual harassment) వంటి సమస్యలు ఎదురైతే భయపడకుండా సాహసంగా స్పందించాలని సూచించారు.

కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు నయోమి, పవిత్ర, 8వ తరగతి విద్యార్థిని అర్చన మాట్లాడారు. విద్యార్థులతో బాల్య వివాహాలు అరికట్టాలి అని కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు(ICDS Project) డైరెక్టర్ పి. ప్రసూన, ఉప విద్యా శాఖ అధికారి వెంకటేశ్వరరావు, ఎంఇఓ అబ్దుల్ కుదుష్, నాగేంద్రమ్మ, ప్రధానోపాధ్యాయురాలు ఆనందకుమారి, తహసిల్దార్ సుభాని తదితరులు పాల్గొన్నారు.

