నిరుపేద కూలీలకు సేద్య భూమి కెటాయించాలి…

నిరుపేద కూలీలకు సేద్య భూమి కెటాయించాలి…
బీకేఎంయు జాతీయ నాయకులు లింగారెడ్డి
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు సేద్య భూమి కేటాయించి ఆదుకోవాలని బీకేఎం జాతీయ నాయకులు మోతే లింగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం హసన్ పర్తి మండలం ముచ్చర్లలో సీపీఐ కార్యకర్థలు ఇంటింటికి వెళ్ళి సామూహిక విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈకార్యక్రమంలో లింగారెడ్డి మాట్లాడుతూ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ సరళీకరణ విధానాలతో ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ జరిగి జాతీయ సంపద కొద్దిమంది గుత్తా పెట్టుబడుదారుల చేతుల్లో చేరుతున్నదని విమర్శించారు.
ఈ విధానాలు మారకపోతే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు నేదునూరి రాజమౌళి మాట్లాడుతూ మోడీ అధికారంలోకి రాకముందు 55 లక్షల కోట్ల అప్పు ఉంటే.. అది ఇప్పుడు 160 లక్షల కోట్లకు చేరిందని,ఇదంతా పేద ప్రజలపై పన్నుల రూపంలో లాక్కోవడం జరుగుతుందని పేర్కొన్నారు.ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రభుత్వం నేటికీ ఇవ్వలేదని, అవి బూటకపు ఎన్నికల వాగ్దానాలుగా మిగిలిపోయాయని అన్నారు.
రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో సగం మాత్రమే అమలు చేసి,మిగతా వాటిని బడ్జెట్ లేదనే నెపంతో కాలయాపన చేయడం తగదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయనట్లైతే సీపీఐ ఆధ్వర్యంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సిపిఐ నాయకులు మెట్టు శ్యాంసుందర్ రెడ్డి, హాసన్ పర్తి మండల సిపిఐ కార్యదర్శి నాయకులు మాదాసి బాబు, గోపు బుచ్చిరెడ్డి,నేదునూరి రామచందర్, వీసం రాజిరెడ్డి, సల్ల రవీందర్ రెడ్డి, స్వరాజ్యలక్ష్మి, వీసం ఇందిరమ్మ, సూర రమేష్, కంచన కుంట్ల సుధాకర్ రెడ్డి, శేషాచలము తదితరులు పాల్గొన్నారు.
