చలి పంజా..

చలి పంజా..
రాష్ట్రంలో చలి తీవత్ర పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పుడిప్పుడే భారీ వర్షాల భీభత్సం నుంచి తెరుకుంటున్న ప్రజలను చలి తీవ్రత వణికిస్తోంది. పగటి పూట వాతావరణం వేడిగా ఉంటుండగా సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత చలి తీవ్రత పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో చలి గాలులతో ప్రజలు సాయంత్రం 6 గంటలు దాటక ముందే ఇళ్లకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెల 11 నుంచి 19 వరకు తెలంగాణలో.. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇందులో నవంబర్ 13 నుంచి 17 వరకు చలి తీవ్రత గరిష్ట స్థాయిలో ఉండబోతుందని తెలియచేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ స్థాయికి (9 డిగ్రీల సెల్సియస్ లోపు) పడిపోవచ్చని అధికారులు తెలిపారు.
అదే విధంగా హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో ఉదయం ఉష్టోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్ నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో మోస్తరు చలి కొనసాగనుంది. ఉష్టోగ్రతలు 14 డిగ్రీల సెల్సియస్ నుంచి 17 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. చలి తీవ్రత పెరనున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు వెచ్చని దుస్తులు ధరించాలని వైద్యులు చెబుతున్నారు.
