Cognizant | విశాఖలో ఐటీ ఎకో సిస్టం…

Cognizant | విశాఖలో ఐటీ ఎకో సిస్టం…

  • స్టార్టప్ కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రొత్సాహం
  • టూరిజానికే కాదు… టెక్నాలజీకి కేంద్రంగా విశాఖ
  • 135 బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా విశాఖ ఎకనమిక్ రీజియన్
  • కాగ్నిజెంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
  • 25 వేల ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం సమక్షంలో కాగ్నిజెంట్ సీఈఓ ప్రకటన

విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో : విశాఖలో ఐటీ ఎకోసిస్టం ఏర్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల విశాఖ ఐటీ కేంద్రంగా అవతరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు.

25 వేల మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో క్యాంపస్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ క్యాంపస్ పూర్తి కానుంది. 2026 నాటికి మొదటి దశ నిర్మాణాన్ని కాగ్నిజెంట్ పూర్తి చేసుకోనుంది. అప్పటివరకు తాత్కాలిక కార్యాలయంలో Cognizant కార్యకాలపాలు కొనసాగనున్నాయి. ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి సారించింది.

కాగ్నిజెంట్‌ క్యాంపస్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ…‘‘ఇన్ హౌస్ కంపెనీగా ఉన్న కాగ్నిజెంట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తోంది. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, కలకత్తా, పూణేలో కాగ్నిజెంట్ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయి. ఇప్పుడు విశాఖలోనూ కాగ్నిజెంట్ అడుగుపెట్టింది. హ్యాపెనింగ్ సిటీ విశాఖకు రావాలని కాగ్నిజెంట్ ను ఆహ్వానించాం.

త్వరలో 25 వేల మందితో పనిచేసే కేంద్రంగా కాగ్నిజెంట్ త్వరలోనే తయారు కావాలి. 34 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కాగ్నిజెంట్ కార్యకలాపాలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. కాగ్నిజెంట్ లో 85 శాతం మంది భారతీయులే. ఆ సంస్థ సీఈఓ కూడా భారతీయుడే కావటం విశేషం. భవిష్యత్తులో విశాఖ క్యాంపస్ లో లక్ష మంది ఉద్యోగులతో పని చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా కాగ్నిజెంట్ ఎదుగుతోంది. గతంలో హైదరాబాద్ లో నాటి టీడీపీ ప్రభుత్వం రూపోందించిన ఎకో సిస్టంతో ఐటీ నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించారు.

3 దశాబ్దాల క్రితం చేసిన విజన్ తోనే దిగ్గజ ఐటీ కంపెనీలకు భారతీయులు నాయకత్వం ఇస్తున్నారు. 1995లో వచ్చిన ఇంటర్నెట్ రివల్యూషన్ తో పాటు ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. అందుకే ఐటీకి బ్యాక్ బోన్ గా భారతీయులు నిలిచే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏఐ విషయంలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకోవాలని భావిస్తున్నాం. ఆ దిశగానే ఏఐ, డేటా సెంటర్లతో విశాఖ ఐటీ డెస్టినేషన్ గా నాలెడ్జి ఎకానమీ కేంద్రంగా తయారవుతోంది.”అని సీఎం వెల్లడించారు.

New railway line | చ‌క‌చ‌కా ప‌నులు..!

Cognizant | బెస్ట్ కనెక్టివిటీ… మోస్ట్ లివబుల్

“విశాఖ నగరానికి బెస్ట్ కనెక్టివిటీ ఉండడంతో పాటు… మోస్ట్ లివబుల్ సిటీగా ఉంది. భోగాపురం విమానాశ్రయం, మెట్రో లాంటి అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు వస్తాయి. ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా విశాఖ రూపుదిద్దుకుంటుంది. నౌకాదళ కేంద్రం నుంచి టూరిజం కేంద్రంగా, ఇప్పుడు టెక్ సిటీగా విశాఖ ఎదిగింది.

కాగ్నిజెంట్ తో పాటు 8 సంస్థలకు ఇవాళ భూమి పూజ చేశాం. గూగుల్ కూడా త్వరలోనే డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే విశాఖలో 150 టెక్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతంలో నైపుణ్యం సాధించిన యువత ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడ్డారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే 20 శాతం జీవన వ్యయం కూడా తక్కువ. ప్రపంచంలోనే బెస్ట్ అండ్ మోస్ట్ లివబుల్ సిటిగా విశాఖను తీర్చిదిద్దుతాం.

దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరం కూడా విశాఖే. 2032కి 135 బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా విశాఖ ఎకనామిక్ రీజియన్ తయారవుతుంది. ఎకరా భూమి 99 పైసలకే ఐటీ కంపెనీలకు ఇవ్వటం ఓ గేమ్ ఛేంజర్. గుజరాత్ లో టాటా నానో కారు తయారీ కేంద్రానికి కూడా 99 పైసలకే ఎకరా చొప్పున భూమి ఇచ్చారు. ఇటీవలే భాగస్వామ్య సదస్సులో 613 ఎంఓయూల ద్వారా రూ. 13.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

అలాగే ఎస్ఐపీబీల ద్వారా మరో రూ .8.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించాం. నేషనల్ క్యాంటం మిషన్ ను అందిపుచ్చుకుని ఏపీలోని అమరావతిలో క్యాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ కేంద్రం అమరావతిలో ఏర్పాటు కాబోతోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను భారతదేశంలో పెట్టుకుంటున్నారు. భారత్ దేశం వైపు ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూస్తోంది.

ఈ క్రమంలో ఏపీని, విశాఖను మరింతగా అభివృద్ధి చేస్తున్నాం. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు విశాఖకు వస్తున్నాయి. కాగ్నిజెంట్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా విశాఖలో పెట్టాలని కోరుతున్నాను. రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్స్, మెడ్ టెక్ జోన్లు ప్రపంచస్థాయి ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి.

పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు ఎస్క్రో ఖాతాను పెడుతున్నాం. ఈ తరహాలో ఆలోచించే ప్రభుత్వాలు ఉండవు. ఆర్టీఐహెచ్ ద్వారా స్టార్టప్ లకు నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాం. సంజీవని ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులను కూడా రూపోందిస్తున్నాం. 15 శాతం వృద్ధి రేటు సాధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది.

8 వేలు కాదు… 25 వేలు

కాగ్నిజెంట్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఆ సంస్థ సీఈఓ రవికుమార్ కీలక ప్రకటన చేశారు. విశాఖ కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. 8 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వంతో కాగ్నిజెంట్ సంస్థ ఒప్పందం చేసుకుంది. అయితే శంకుస్థాపన కార్యక్రమానికి ముందుగా రవికుమార్ తో సీఎం చంద్రబాబు కొద్దిసేపు సంభాషించారు.

8 వేల ఉద్యోగాలు కాదని… విశాఖ క్యాంపస్ లో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు శంకుస్థాపన కార్యక్రమం వేదికగా చంద్రబాబు సమక్షంలో 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని రవికుమార్ ప్రకటించారు. విశాఖకు రావడం తన సొంతింటికి వచ్చినట్టుందని రవికుమార్ అన్నారు.

9 IT COMPANYS | విశాఖలో దిగ్గ‌జ కంపెనీలు..

మరో 8 సంస్థలకు శంకుస్థాపనలు

కాగ్నిజెంట్ సంస్థతో పాటు త్వరలోనే విశాఖ నుంచి మరికొన్ని సంస్థలు కూడా కార్యాకలాపాలు మొదలు పెట్టనున్నాయి. వీటిల్లో కొన్నింటికి శుక్రవారం నాడే శంకుస్థాపనలు జరిగాయి. టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్, నాన్రెల్ టెక్నాలజీస్ వంటి సంస్థలకు శంకుస్థాపనలు జరిగాయి.

త్వరలో విశాఖలో తమ కార్యకలాపాలు చేపట్టనున్నట్టు ఆయా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సంస్ధల ద్వారా రాష్ట్రానికి రూ. 3,740 కోట్ల పెట్టుబడులు, దాదాపు 41,700 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ప్రస్తుతం విశాఖలో 150కి పైగా టెక్ కంపెనీల కార్యకలాపాలు సాగిస్తుండడంతో రాష్ట్రంలో ఐటీ నిపుణులకు విస్తృతంగా అవకాశాలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో ఒక్క విశాఖలోనే రూ.1.34 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయి.

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్, డీబీవీ స్వామి, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు ఘంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్, ఐటీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Cognizant

AP CM | ప్ర‌పంచ వ్యాప్తంగా కాగ్నిజెంట్

Leave a Reply