- బీసీ హాస్టల్లో విద్యార్దులతో కలసి లంచ్ చేస్తుండగా ఘటన
- వార్డెన్, వంట మనుషులపై ఆగ్రహం
- రోజూ విద్యార్ధులకు ఇలాగే పెడుతున్నారా అంటూ మండిపాటు
- సస్పెండ్ చేస్తానంటూ వార్నింగ్
పాయకరావుపేట : హాస్టల్‌లో వసతులు తెలుసుకుని, అక్కడి పరిస్థితులు, భోజనం పరిశీలించడానికి వెళ్లిన ఏపీ హోమంత్రి అనిత (AP Home Minister Anitha) కు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలోని ఒక బీసీ బాలికల హాస్టల్‌ను సందర్శించిన ఆమె అక్కడి విద్యార్థినులతో కలిసి భోజనం చేయాలనుకున్నారు. ఈ క్రమంలో హోంమంత్రి నేటి ఉదయం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తుండగా ఆమె ప్లేట్‌లోనే బొద్దింక (Cockroach) వచ్చింది. ఆ ఘటనను చూసి అవక్కాయిన హోంమంత్రి అక్కడి వంట మనుషులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన పర్యటనలోనే ఇలా చేదు అనుభవం ఎదురవ్వడం, తనకు పెట్టిన భోజనంలోనే బొద్దింక రావడాన్ని ఆమె సీరియస్ (Serious) గా తీసుకున్నారు. వంట సిబ్బందికి ఆ బొద్దింకను చూపించి, పిల్లలకు రోజు ఇలాంటి భోజనమే పెడుతున్నారా అంటూ మండిపడ్డారు. ఇక స్కూళ్లలో సన్నబియ్యంతోనే భోజనం పెట్టాలని ప్రభుత్వం ఆదేశించినా ఇప్పటి వరకు గ్రౌండ్ లెవల్‌లో అది జరగకపోవడాన్ని ఆమె తీవ్రంగా పరిగణించారు. ఒకరిద్దరిని విధుల నుండి తొలగిస్తే దారికి వస్తారని మండిపడ్డారు.