Revanth Reddy | 5న నర్సంపేటలో సీఎం పర్యటన..

Revanth Reddy | 5న నర్సంపేటలో సీఎం పర్యటన..

  • రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • సిద్ధమవుతున్న సభావేదిక

నర్సంపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు నర్సంపేటలో శంకుస్థాపన చేయనున్నారు. ఈనెల 5వ తేదీన నర్సంపేట మెడికల్ కాలేజ్ ప్రాంతంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రకటించారు.

శుక్రవారం ఒంటిగంటకు సీఎం రానున్నట్లు తెలిపారు. సీఎం చేతుల మీదుగా వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు పేర్కొన్నారు.

గతంలో ఎడమొఖం పెడముఖంగా ఉన్న ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్య సయోధ్య కుదరడంతో మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేటకు వస్తూనే రూ.1000 కోట్ల అభివృద్ధి పనులకు జీవో కూడా విడుదల చేశారు.

నర్సంపేట పట్టణం, నియోజకవర్గంలోని రూ.228 కోట్లతో రోడ్ల అభివృద్ధి, రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.150 కోట్లతో మెడికల్ కాలేజ్, రూ.25 కోట్లతో నర్సింగ్ కాలేజ్, రూ.20 కోట్లతో నర్సంపేట పట్టణం మున్సిపాలిటీ విలీన గ్రామాలకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, సెంట్రల్ లైటింగ్, నర్సంపేట పోలీస్ స్టేషన్ నుండి నాగూర్ల పల్లె మాదన్నపేట వరకు సెంట్రల్ లైటింగ్, సీసీడబుల్ రోడ్డు నిర్మాణం, నర్సంపేట నుండి మాగ్డం పురం- రాజపల్లె వరకు డబుల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్, మహేశ్వరం లోపలికి సెంట్రల్ లైటింగ్ డబుల్ రోడ్డు, 400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రకటించారు.

వరంగల్ నుండి ధర్మారం మీదుగా నర్సంపేట వరకు రూ.83కోట్లతో 4 లైన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. నర్సంపేట నుండి పాకాల వరకు 10 కిలోమీటర్లు డబుల్ రోడ్డు రూ.17కోట్ల 28 లక్షలతో రోడ్డు నిర్మాణం, నెక్కొండ కే సముద్రం. 12.10 కిలోమీటర్లు రూ.38 కోట్ల 74 లక్షలతో డబుల్ రోడ్డు నిర్మాణం, నర్సంపేట నుండి నెక్కొండ వరకు 18. 47 కిలోమీటర్లు రూ.56 కోట్ల 40 లక్షలతో డబుల్ రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు.

నెక్కొండ గూడూర్ డబుల్ రోడ్డు పది కిలోమీటర్లు రూ.33కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. శుక్రవారం నిర్వహించే సీఎం సభ ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ త్వరగా పనులు పూర్తి చేయడానికి సన్నద్ధమవుతున్నారు.

Leave a Reply