తక్షణమే సీఎం విచారణ జరిపించాలి

  • ఆ మంత్రులను బర్తరఫ్‌ చేయాల్సిందే
  • పోలీసులపై దాడులు సిగ్గుచేటు
  • గోరక్షకులపై కాల్పులు జరిపితే ఏం చేస్తున్నారు
  • రౌడీషీటర్లకు ఎంఐఎం అండ.. ఎంఐఎం నేతల కాళ్లు పట్టు-కునే దుస్థతిలో కాంగ్రెస్‌
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

కరీంనగర్‌ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని కొందరు మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుని అవమానిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆరోపించారు. మహిళా అధికారులను అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సోమవారం కరీంనగర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తక్షణమే ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Chief Minister Revanth Reddy) విచారణ జరిపి నివేదిక తెప్పించుకోవాలని సూచించారు.

అలాంటి మంత్రులను కేబినెట్‌ నుండి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పాలన అంటేనే మహిళలు అసహ్యించుకునే పరిస్థితి ఉందన్నారు. ముఖ్యంగా మహిళలకు ప్రతినెలా రూ.2500లు, తులం బంగారం, స్కూటీ ఇస్తానని మోసం చేశారని మండిపడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ పాలన(Congress rule)లో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, ఎంఐఎంకు చెందిన రౌడీషీటర్లు పోలీసులను చంపినా, హత్యాయత్నం చేసే స్థాయికి పెట్రేగిపోతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జూబ్లిహిల్స్‌లో ఒకవర్గం ఓట్ల కోసం ఎంఐఎం కాళ్లు పట్టుకునే స్థాయికి కాంగ్రెస్‌ పార్టీ దిగజారిపోయిందని ఆరోపించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి రావాలంటే యూపీ తరహాలో రౌడీషీటర్లపై(rowdy sheeters) ఉక్కుపాదం మోపాలని సూచించారు. రాష్ట్రం శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని, సాక్షాత్తు పోలీసులపై దాడులు చేస్తున్నారన్నారు. మొన్న నిజామాబాద్‌(Nizamabad)లో మజ్లిస్‌ రౌడీషీటర్‌ కానిస్టేబుల్‌ను చంపేశారని, నిన్న హైదరాబాద్‌ నడిబొడ్డున డీసీపీ చైతన్య, కానిస్టేబుల్‌పై ఎంఐఎం రౌడీషీటర్‌ దాడి చేసి హత్యాయత్నం చేశారని అన్నారు.

గోరక్షులపై కాల్పులు జరిపి చంపేందుకు యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము బాధితులకు అండగా వెళ్లి పోలీసులను పరామర్శిస్తే మజ్లిస్‌ నేతలు మాత్రం రౌడీషీటర్లను పరామర్శిస్తూ వారికి కొమ్ము కాస్తున్నారన్నారు. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడల్లా ఎంఐఎంను పెంచి పోషిస్తున్నాయని, శాంతి భద్రతలు పట్టడం లేదని ధ్వజమెత్తారు. అందుకే ఆ పార్టీల కోసం ఒవైసీ బీహార్‌ ను వదిలి జూబ్లిహిల్స్‌(Jubilee Hills) లో తిష్టవేసి ముస్లిం ఓట్ల కోసం ప్రచారం చేస్తున్నారన్నారు.

ఇకనైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓట్ల రాజకీయం మానుకోవాలని, డీసీపీ చైతన్యపై హత్యాయత్నం చేసిన రౌడీషీటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. యూపీ ప్రభుత్వాన్ని స్పూర్తిగా తీసుకుని రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలన్నారు. అక్కడ రౌడీషీటర్లకు బెయిల్‌ వచ్చినా బయటకు రాకుండా జైల్లోనే ఉండే పరిస్థితి అని పేర్కొన్నారు. అట్లాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప రౌడీషీటర్లను కంట్రోల్ చేయడం కష్టమన్నారు.

దురదృష్టవ‌శాత్తు ముఖ్యమంత్రే నక్సలిజం తన ఫిలాసఫీ అంటారన్నారు. ఒవైసీ మంచోడని కితాబు ఇస్తున్నారని, అక్బరుద్దీన్‌ ఒవైసీ(Akbaruddin Owaisi) కొడంగల్‌లో పోటీ చేస్తే గెలిపిస్తానని అంటారని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంఐఎం వద్ద మోకరిల్లుతున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Leave a Reply