జాతీయ నేత‌ల‌తో భేటీ..

న్యూఢిల్లీ – ఆంధ్రప్రభ ప్రతినిధి : దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ నేపధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. శంషాబాద్ నుండి ప్రత్యేక విమానంలో రాత్రి 9 గంటలకు హస్తిన చేరిన ఆయ‌న ఢిల్లీ టూర్‌కు ప్రాధాన్యం సంత‌రించుకుంది.

మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అనంతరం ఫలితాలు ప్రకటించబడతాయి. ఈ ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలన్నదానిపై తెలంగాణ నుంచి ఎన్నికైన ఎంపీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు.

అదేవిధంగా, సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమవ్వనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో కూడా రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా, రాష్ట్రానికి సంబంధించిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై వినతిపత్రాలు అందజేయనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల భారీ వర్షాల కారణంగా తెలంగాణలో రైతులు పంట నష్టాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు కేంద్ర మంత్రులను కలిసి రూ.5,000 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నేపధ్యంలోనే, యూరియా కొరత, రైతుల ఆందోళనలు వంటి అంశాలపై కూడా సీఎం రేవంత్ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసే అవకాశం ఉందని సమాచారం.

Leave a Reply