Revanth Reddy | అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం..

Revanth Reddy | అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం..
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్మీర్ షరీఫ్ దర్గాకు పవిత్రమైన చాదర్‌ను సమర్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో… హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ 814వ ఉర్సు వేడుకలను పురస్కరించుకుని ఆయన చాదర్‌ను అందజేశారు.
అజ్మీర్ దర్గాను ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, సోదరభావానికి చిహ్నంగా అభివర్ణించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, మతసామరస్యం వర్ధిల్లాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఈ వేడుకలో పాల్గొన్న మైనార్టీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ‘సెక్యులర్ సీఎం’గా కొనియాడుతూ, ఆయన అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని ప్రశంసించారు. ప్రతి ఏటా అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించే సంప్రదాయాన్ని ఆయన కొనసాగిస్తున్నారని, ముఖ్యంగా తెలంగాణ నుండి వెళ్లే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అజ్మీర్‌లో ‘రుబాత్’ను నిర్మించిందని వారు గుర్తుచేశారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ చర్యలు నిదర్శనమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ అలీలతో పాటు ఎంపీ పోరిక బలరాం నాయక్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వీరితో పాటు TMREIS వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషీ, హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ ఖాద్రీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.


