ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం చోటుచేసుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తపై ఓ ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడు. ఫిర్యాదుదారుడిలా వచ్చిన దుండగుడు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన సివిల్ లైన్స్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆగంతకుడిని అదపులోకి తీసుకున్నారు.
కట్టుదిట్టమైన భద్రత ఉండే ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఇలాంటి ఘటన జరగడం రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటనపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ముఖ్యమంత్రి భద్రతకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, భద్రతా లోపాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఈ దాడి అనేక ఆందోళనలను రేకెత్తించింది.