AP | హంద్రీనీవా నుంచి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు

కర్నూలు బ్యూరో : నందికొట్కూరు (Nandikotkur) మండలం మల్యాల గ్రామం హెచ్ఎన్ఎస్ఎస్ పంపింగ్ స్టేషన్ వన్ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి కాల్వకు శ్రీశైలం కృష్ణా జలాలను (Krishna waters) ఎత్తిపోతల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నీటిని విడుదల చేశారు. మల్యాలలోని హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ వన్ వద్దకు మధ్యాహ్నం 1.40 గంటలకు చంద్రబాబు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి మంగళ వాయిద్యాలతో ఆహ్వానం పలికి.. వేదమంత్రాలతో పండితులు ఆశీర్వచనం చేశారు.

ఈసందర్భంగా హెచ్ఎంఎస్ఎస్ ప్రాజెక్టు (HMSS Project) కు సంబంధించి జలవనరుల శాఖ అక్కడ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను, ప్రాజెక్టు అలైన్ మెంట్ ఆయకట్టు, కృష్ణా రివర్ బేసిన్ మ్యాపులను సీఎం తిలకించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే పంపింగ్ స్టేషన్ వ్యూ పాయింట్ (Pumping station view point) నుంచి నీటిని పరిశీలించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పంపింగ్ స్టేషన్ లో స్విచ్ ఆన్ చేసి శ్రీశైలం కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈసందర్భంగా ప్రాజెక్టుపైకి చేరుకొని మల్యాల ఎత్తిపోతల వద్ద హంద్రీనీవా జలాలకు జలహారతులు ఇచ్చి, రైతుల హర్షద్వానాల మధ్య పట్టు వస్త్రాలు సమర్పించారు.

అనంతరం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు.. రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళిక బద్దంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ఇరిగేషన్ శాఖ అంటే ప్రాజెక్టులు.. కాల్వలే కాకుండా.. భూగర్భ జలాల వినియోగం వంటివి కూడా చూసుకోవాలన్నారు. తిరుపతి వద్ద గాలేరు-నగరి, హంద్రీ-నీవా, సోమశిల-స్వర్ణముఖి కలిసేలా ప్రణాళికలు చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూఖ్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్పీ అధిరాజ్ సింగ్, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు గిత్త జయసూర్య, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, జల వనరుల శాఖ సీఈలు ఎస్.కబీర్ భాష, నాగరాజు, టీజీపీ ఎస్ఈ ప్రతాప్, ఇరిగేషన్ ఎస్ఈ పాండురంగయ్య, ఆర్డీవో విశ్వనాధ్, ప్రాజెక్టు ఈఈలు, డీఈలు, నీటి సంఘాల ప్రతినిధులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply