పదవ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పిన సీఎం
శ్రీ సత్యసాయి బ్యూరో, జులై 10 (ఆంధ్రప్రభ ) : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించింది. వరుసగా రెండో ఏడాది విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా పేరెంట్ టీచర్ సమావేశాన్ని (Mega Parent Teacher Meeting) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఉపాధ్యాయుడుగా మారాడు. ఇదే సందర్భంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విద్యార్థిగా మారారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు ఉపాధ్యాయులుగా మారి పదవ తరగతి విద్యార్థుల (10th class students) కు పాఠాలు చెప్పారు. పదవ తరగతి విద్యార్థులతో కలిసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తండ్రి చెబుతున్న పాఠాలను శ్రద్ధగా విన్నారు.
ఈ అరుదైన సంఘటన గురువారం శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు (Kothacheruvu) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో జరిగింది. చంద్రబాబు నాయుడు పదవ తరగతి విద్యార్థులకు మానవ వనరులు, అనే అంశంపై పాఠం చెప్పడం జరిగింది. ముఖ్యంగా మానవ వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనేది వివరించారు.
