CLP Meet | నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి కీలక భేటి
హైదరాబాద్ : ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖాముఖి నిర్వహించనున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఈ ముఖాముఖి కొనసాగనుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
అయితే ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి,భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షీ, మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.
ఇక, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు కొనసాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఈ సమావేశం జరిగింది. కొన్ని నియోజకవర్గాలకు మాత్రం ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయని అసంతృప్త ఎమ్మెల్యేలు రగిలిపోతున్నట్టుగా ప్రచారంసాగుతుంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ వద్ద ప్రస్తావించి.. పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్దామనే ఉద్దేశంతో అసంతృప్త నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది.