నస్పూర్, ఫిబ్రవరి 27 (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా, నస్పూర్ పట్టణంలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం 8గంటలకు ప్రశాంతంగా మొదలైన టీచర్, పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియ కాంగ్రెస్, బీజేపీ నాయకులు అరంగేట్రంతో ఉద్రిక్తత వాతావరం నెలకొంది.
దారికి అడ్డంగా పెట్టిన బండ్లను, ఓటర్లని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులు దూరంగా ఉండాలంటూ పోలీసులు వారించడంతో బీజేపీ నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో కాంగ్రెస్ నాయకులు కల్పించుకొని ఇరువర్గాలు బూతుపురాణం అందుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగామారింది. దీంతో కాంగ్రెస్ నాయకులకు పోలీసులు మద్దతు ఇస్తున్నారంటూ తమపై పోలీసులు చేయి చేసుకున్నారని బీజేపీ నాయకులు వాగ్వివాదానికి దిగుతూ రాస్తారోకో నిర్వహించారు.
ఇదే అదును చూసుకొని కొందరు అల్లరి మూకలు రాళ్లు విసరడంతో పరిస్థితి అదుపుతప్పడంతో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ లు రంగంలోకి దిగి ఇరువర్గాలతో మాట్లాడి, అల్లరి మూకలను చదరగొట్టి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. అల్లర్లకు ఆద్యం పోసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఇరువర్గాలను ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.