Civils | తన లక్ష్యం సివిల్స్..

Civils | తన లక్ష్యం సివిల్స్..

  • మొదట గ్రూప్ 4, ఆ తరువాత గ్రూప్ 3 లో మెరిసిన లావణ్య
  • నేడు హైదరాబాద్‌లో అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్‌ హెడ్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు
  • వరుస విజయాలతో సత్తా చాటుతున్న సింగరేణి బిడ్డ లావణ్య

Civils | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తండ్రి లేకపోయినా ఆమె అడుగులు విజయం వైపు.. ఆమె ఆలోచనలు సమాజం వైపు! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వరుసగా ప్రభుత్వ కొలువులు సాధిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది బెల్లంపల్లికి చెందిన కాటిక నర్సింగరావు కూతురు కాటిక లావణ్య. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపిస్తూ, ఉన్నత చదువుల నుంచి ఉన్నత ఉద్యోగాల వరకు ఆమె సాగించిన ప్రయాణం నేటి యువతకు ఒక గొప్ప దిక్సూచి.

చదువుల్లో మేటి.. ప్రతిభలో మేటి!

చిన్నప్పటి నుంచే చదువుపై అమితమైన ఆసక్తిని ప్రదర్శించిన లావణ్య, తన విద్యాభ్యాసంలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. బెల్లంపల్లి చైతన్య పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసి, అనంతరం బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తన పునాదులను పటిష్టం చేసుకుంది. ఆపై హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సీబీఐటీ లో బీటెక్ పూర్తి చేసి, 2022లో ఎంటెక్ పట్టాను అందుకుంది. అపారమైన సాంకేతిక జ్ఞానాన్ని సంపాదించినా, ఆమె కళ్లు మాత్రం ప్రజా సేవపైనే నిలిచాయి.

కొలువుల వేట.. అప్రతిహత విజయయాత్ర!

Civils |

2022 లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రంగంలోకి అడుగుపెట్టిన లావణ్య, తన లక్ష్యాలను అత్యంత స్పష్టంగా నిర్దేశించుకుంది. గ్రూప్-1 నుండి కానిస్టేబుల్ వరకు ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలని ప్రయత్నించింది. తొలి విజయం: 2023లో గ్రూప్-4 సాధించి అటవీశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా కొలువులో చేరింది.

మరో మలుపు : అటవీశాఖలో విధులు నిర్వహిస్తూనే గ్రూప్-3 సాధించి తన ప్రతిభను చాటుకుంది. హైదరాబాద్‌లోని అగ్రికల్చర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌ లో గ్రూప్-3 ఉద్యోగానికి ఎంపికైంది. తాజాగా అటవీశాఖ అధికారుల నుంచి రిలీవ్ లెటర్ అందుకుని, వ్యవసాయ విభాగం జీఎం చేతుల మీదుగా నియామక పత్రం అందుకుని తన విజయాల హ్యాట్రిక్‌ను పూర్తి చేసింది.

సివిల్స్ దిశగా అడుగులు..

“ఉద్యోగం సాధించడం అన్నది నా ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. నా అసలు లక్ష్యం సివిల్స్ కొట్టడమే” అని లావణ్య తన ఆశయాన్ని వెల్లడించింది. ఐఏఎస్ అధికారిగా మారి సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలన్నదే తన ఏకైక ధ్యేయమని స్పష్టం చేసింది. బెల్లంపల్లి వంటి కోల్ బెల్ట్ ప్రాంతం నుండి వచ్చి, వరుసగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తూ సివిల్స్ వైపు దూసుకుపోతున్న లావణ్యను పట్టణ ప్రముఖులు, విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు.

Leave a Reply