Cinema| భక్త కన్నప్ప నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్
హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నప్ప టీం ప్రమోషన్స్‌ను మరింతగా పెంచేసింది.
మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా కన్నప్ప నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ చేతుల మీద ఈ పాటను విడుదల చేశారు. బెంగుళూరులోని శ్రీ శ్రీ రవిశంకర్ గారి ఆశ్రమంలో మోహన్ బాబు, మంచు విష్ణు, దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్, కన్నడ డిస్ట్రిబ్యూటర్ రాక్‌లైన్ వెంకటేశ్, నటి సుమలత, భారతి విష్ణువర్ధన్, సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ, నటుడు అర్పిత్ రాంకా, రామజోగయ్య శాస్త్రితో సహా కన్నప్ప బృందం సమక్షంలో ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ గురూజీ కన్నప్ప చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
‘శివా శివా శంకరా’ అంటూ సాగే ఈ పాటను విజయ్ ప్రకాష్ ఆలపించారు. స్టీఫెన్ దేవస్సీ ఆహ్లాదకరమైన బాణీకి… రామజోగయ్య శాస్త్రి సాహిత్యం మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఇక ప్రభుదేవా కొరియోగ్రఫీ పాటను మరింత అర్థవంతంగా మార్చింది. ఇక హిందీలో ఈ పాటను జావేద్ అలీ పాడగా… శేఖర్ అస్తిత్వ సాహిత్యాన్ని అందించారు.
ఈ చిత్రంలో రుద్రుడిగా ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న కన్నప్ప చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.