Christmas celebration | ప్రభువు కృపతో ప్రజలంతా ఆనందంగా ఉండాలి..

Christmas celebration | ప్రభువు కృపతో ప్రజలంతా ఆనందంగా ఉండాలి..
- నల్లగొండ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
Christmas celebration | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : యేసు ప్రభువు కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) ఆకాంక్షించారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని ఇవాళ ఆయన నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ లోని పురాతన సేయింటినరీ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుక(Christmas celebration)ల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… యేసు క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పురాతన సేయింటినరీ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో వేలాది మందితో కలిసి పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. యేసుక్రీస్తు(Jesus Christ) బోధనలు ప్రేమ, శాంతి, త్యాగం, సేవా భావాన్ని మనకు గుర్తుచేస్తాయన్నారు.
మిషనరీలు, హాస్పిటల్స్ సేవా భావంలో క్రైస్తవులు ముందుంటారన్నారు. యేసు బోధనలు శాంతిని, ప్రేమను కోరుకునే విధంగా ఉంటాయని, శత్రువును సైతం క్షమించే గుణం కలిగి ఉండాలనే ఆయన బోధనలు ప్రపంచ మానవాళికి ఆచరణీయమన్నారు.
డిసెంబర్ నెల అంటే తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని నింపిన నెల అని, డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసిన రోజు, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ పుట్టిన రోజు ఒకే రోజు కావడం మన అదృష్టమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నామన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం లాంటి మానవీయ కోణంలో పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న.. ముఖ్యమంత్రి, మంత్రులం సమష్టిగా పనిచేస్తూ రాష్ట్రాన్ని రెండేళ్లుగా క్రమంగా గాడిన పెడుతున్నామన్నారు. యేసు ప్రభువు కృపతో ప్రజలు అంతా ఆనందంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథంలో సాగాలని ప్రార్ధిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
