Chittoor | 1 రోజులోనే.. 9 గ్రామాల్లో..

Chittoor | 1 రోజులోనే.. 9 గ్రామాల్లో..
Chittoor, విజయపురం, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా (Chittoor) విజయపురం మండలం పరిధిలో రూ.67.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న తొమ్మిది సిమెంట్ రోడ్లకు బుధవారం శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కలిసి హాజరయ్యారు. ఒక్కరోజులోనే తొమ్మిది గ్రామాల్లో రోడ్ల పనులను ప్రారంభించడం స్థానిక ప్రజల్లో ఆనందాన్ని కలిగించింది.
ఎస్టీ కాలనీలో రోశమ్మ ఇంటి నుండి జ్యోతమ్మ ఇంటి వరకు రూ.2 లక్షలు, అదే కాలనీలో గోవిందమ్మ ఇంటి నుండి రాంబాబు ఇంటి వరకు రూ.8.40 లక్షలు, విజయపురం మెయిన్ రోడ్డు నుండి ఉపాది కార్యాలయం వరకు రూ.1.50 లక్షలు, BSNL కార్యాలయం నుండి కొత్త ఇళ్లత్తూరు రోడ్డువరకు రూ.26 లక్షలు, ఆర్‌బీకే సెంటర్ నుండి వెంకటేశ ఇంటి వరకు రూ.5 లక్షల వ్యయంతో రోడ్ల పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
అదే విధంగా మిట్టూరు గ్రామంలో మునిరెడ్డి ఇంటి నుండి జానకమ్మ ఇంటి వరకు రూ.4.30 లక్షలు, కోశలనగరం గ్రామంలో వినాయక స్వామి గుడి నుండి సచివాలయం వరకు రూ.6 లక్షలు, కేశవపురం గ్రామంలో టి.మణి ఇంటి నుండి సుబ్రహ్మణ్యం ఇంటి వరకు రూ.6 లక్షలు, కృష్ణసముద్రం గ్రామంలో దుర్గమ్మ గుడి నుండి ఓవర్ హెడ్ ట్యాంక్ వరకు రూ.8 లక్షలతో రోడ్ల నిర్మాణం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంలోనే నియోజకవర్గంలో రూ.100 కోట్లకు పైగా రహదారి నిర్మాణ పనులు చేపట్టామని, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు మౌలిక వసతుల మెరుగుదల ప్రాధాన్యతగా కొనసాగుతుందని పేర్కొన్నారు.


