Chittoor | దేశంలోనే ఏపీ నెం.1

Chittoor | దేశంలోనే ఏపీ నెం.1

Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : పెట్టుబడుల సాధనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం యాదృచ్ఛికం కాదని, ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, మంత్రి నారా లోకేష్ క్షేత్రస్థాయి అమలు ఫలితమేనని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ తెలిపారు. శనివారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థిక పరిశోధనా సంస్థ గణాంకాల ఆధారంగా విడుదలైన తాజా నివేదిక ప్రకారం 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దేశ వ్యాప్తంగా ప్రకటించిన పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇది కేవలం 9 నెలల గణాంకాలేనని, అయినప్పటికీ.. రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిని స్పష్టంగా చూపిస్తున్నాయని పేర్కొన్నారు.

గత వైసీపీ పాలనలో విధానాల పై అనిశ్చితి, పరిశ్రమల పై వేధింపుల కారణంగా పెట్టుబడులు రాష్ట్రం నుంచి బయటకు వెళ్లాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 25 పారిశ్రామిక విధానాలు, ఏకీకృత అనుమతుల విధానం, వేగవంతమైన నిర్ణయాలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం తిరిగి నెలకొన్నదన్నారు. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ద్వారా కృత్రిమ మేధస్సు కేంద్రం, అమరావతిలో క్వాంటం వ్యాలీ, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్ స్టీల్ పరిశ్రమ వంటి భారీ ప్రాజెక్టులు రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చాయని తెలిపారు. ఇటీవల నిర్వహించిన పారిశ్రామిక సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించడం దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టమని పేర్కొన్నారు.

కేవలం 18 నెలల్లోనే రాష్ట్రానికి రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు, సుమారు 26 లక్షల ఉద్యోగావకాశాలు రావడం కూటమి ప్రభుత్వ పాలనా విజయానికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు. పెట్టుబడులు కాగితాలకే పరిమితం కాకుండా భూమి పై అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యుత్, పునరుత్పాదక శక్తి, రసాయనాలు, లోహ పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగం, రవాణా, కృత్రిమ మేధస్సు, ఆహార ప్రాసెసింగ్ వంటి కీలక రంగాల్లో భారీ పెట్టుబడులు రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తాత్కాలికం కాదని, దీర్ఘకాలిక పారిశ్రామిక వృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు సాగుతోందని వెంకిటీల సురేంద్ర కుమార్ స్పష్టం చేశారు.

Leave a Reply