బాసర, జూన్ 12 (ఆంధ్ర ప్రభ) : కాచిగూడ – నగర్సోల్ రైల్లో బాసర రైల్వేస్టేషన్ (Basara Railway Station) వద్ద మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన గురువారం బాసర రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలోని ధర్మబాద్ మండలం కర్కెళ్లి గ్రామానికి చెందిన నాగేశ్వరి (32) నిజామాబాద్ (Nizamabad) లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది మహారాష్ట్ర లోని కర్కేల్లి గ్రామానికి వెళ్ళడానికి నిజామాబాద్ లో కాచిగూడ నాగర్సోల్ రైలు ఎక్కింది.
రైల్లో పురిటినొప్పులు అధికమవ్వడంతో బాసర (Basara) రైల్వే స్టషన్ అధికారులను కుటుంబ సభ్యులు అప్రమత్తం చేశారు. దీంతో రైల్వే పోలీస్ సురేష్, స్టేషన్ మేనేజర్ రవీందర్ (Ravinder) వెంటనే స్పందించి స్థానిక అంబులెన్స్ కు కాల్ చేసి 108 అంబులెన్స్ లో బైంసా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని అంబులెన్సు పైలెట్ నవీన్ తెలిపారు. సకాలంలో స్పందించిన రైల్వే అధికారులకు, సిబ్బందికి, ప్రయాణీకులకు దంపతులు అభినందనలు తెలిపారు.