Chicken Shops | రేపటి నుంచి చికెన్ షాపులు బంద్!

Chicken Shops | రేపటి నుంచి చికెన్ షాపులు బంద్!
Chicken Shops | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ కానున్నాయి. భాగ్యనగరంలో చికెన్ ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజులుగా కిలో మాంసం ధర రూ. 300 నుండి రూ. 325 వరకు పలకడంతో సామాన్యులు చికెన్ కొనాలంటేనే భయపడిపోయారు. అయితే, ఆదివారం నుండి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ ఆకస్మిక ధరల తగ్గింపుతో మాంసప్రియులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
అయితే ఒకవైపు ధరలు తగ్గుతుంటే, మరోవైపు చికెన్ వ్యాపారులు సమ్మె బాట పట్టడం నగరంలో కలకలం రేపుతోంది. తమకు వచ్చే లాభాల మార్జిన్‌ను పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం (రేపటి) నుండి హైదరాబాద్‌లోని చికెన్ షాపులను మూసివేయాలని వ్యాపారుల సంఘం నిర్ణయించింది. రిటైల్ చికెన్ షాపుల్లో రెంట్, కూలీల జీతాలు, కరెంట్ బిల్లు, వాటర్ ఖర్చులు, అమ్ముడుపోని చికెన్ ..ఇవన్నీ తీసేస్తే కిలోకి రూ.5 నుంచి రూ. 6 మాత్రమే మిగులుతోందని చికెన్ షాప్ ఓనర్స్ చెప్తున్నారు.
హోల్‌సేల్ ధరలకు, రిటైల్ విక్రయాలకు మధ్య వ్యత్యాసం తమకు గిట్టుబాటు కావడం లేదని, దీనివల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు గనుక నిరసనను కొనసాగిస్తే పౌల్ట్రీ రంగంపై అది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతిరోజూ టన్నుల కొద్దీ విక్రయాలు జరిగే హైదరాబాద్ మార్కెట్ నిలిచిపోతే, పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పౌల్ట్రీ కంపెనీల మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తగ్గించిన మార్జిన్ పెంచే వరకు చికెన్ షాపులు తెరిచేది లేదని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నారు.
