Chess | వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ కు చెక్ పెట్టిన ప్రజ్ఞానందా !

  • చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానందా
  • కార్ల్‌సన్‌ను మూడు ఫార్మాట్లలోనూ ఓడించిన తొలి భారతీయుడు

ప్రపంచ నంబర్ 1 చెస్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్ల వరల్డ్‌ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ వరుస పరాజయాలతో ఒత్తిడిలో పడిపోయాడు. భారత యువ గ్రాండ్‌మాస్టర్లు అతడి ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నారు. ఇటీవల రెండు కీలక టోర్నీల్లో డి. గుకేశ్, ఆర్. ప్రజ్ఞానందా కార్ల్‌సన్‌ను చిత్తుచేసి భారత చెస్ ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో చాటించారు.

గ్రాండ్ చెస్ టూర్ 2025 జాగ్రెబ్ ఈవెంట్‌లో కార్ల్‌సన్‌పై గుకేశ్ గెలవ‌గా, తాజాగా జ‌రుగుతున్న లాస్ వెగాస్ ఫ్రీ స్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్‌లో భారత యువ చెస్ స్టార్ 19 ఏళ్ల ప్రజ్ఞానందా కార్ల్‌సన్‌ను కేవలం 39 ఎత్తుల్లో ఓడించాడు. ఇది చెస్ 960 (ఫిషర్ ర్యాండమ్ చెస్) ఫార్మాట్‌లో జరగడం విశేషం. తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానందా 93.9% ఖచ్చితత్వంతో అద్భుత ఆట ప్రదర్శించగా, కార్ల్‌సన్ కేవలం 84.9% వరకు పరిమితమయ్యాడు.

మూడింట్లోనూ చిత్తు..

ప్రజ్ఞానందా ఇప్పటికే క్లాసికల్, రాపిడ్, బ్లిట్జ్ ఈ మూడు ఫార్మాట్లలోనూ కార్ల్‌సన్‌ను ఓడించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ఇది భారత చెస్ చరిత్రలో కొత్త మైలురాయి. ఈ ఏడాది ప్రజ్ఞానంద మూడు కీలక టోర్నీలు గెలిచాడు. కార్ల్‌సన్ ఈ ఈవెంట్‌లో మరో మ్యాచ్‌లో వెస్లీ సో చేతిలోనూ ఓడిపోవడంతో టైటిల్ రేసు నుంచి బయటకు వెళ్లాడు.

కార్ల్‌సన్‌పై ఈ విజ‌యంతో గ్రూప్ వైట్‌లో ప్రగ్యానంద 4.5 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మ్యాగ్నస్ కార్ల్‌సన్ గ్రూప్ వైట్‌లో ఐదో స్థానంతోనే సరిపెట్టుకొని టైటిల్ రేసు నుంచి నిష్క్రమించాడు.

క్వార్టర్ ఫైనల్ టైటిల్ పోరు

ఫ్రీ స్టైల్ చెస్‌ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఆటగాడికి 30 నిమిషాల క్లాసికల్ టైమ్ కంట్రోల్ ఉంటుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ప్రతి గ్రూప్‌లో ఎనిమిది మంది తలపడతారు. గ్రూప్ టాప్ 4లో నిలిచినవారికి క్వార్టర్‌ఫైనల్స్ అవకాశం. విజేతలకు రెండు లక్షల అమెరికన్ డాలర్లు బహుమతిగా లభిస్తాయి. క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లు గురువారం జరగనున్నాయి..

గ్రూప్ బ్లాక్ లో ఎరిగైసి..

ఇక గ్రూప్ బ్లాక్‌లో ఎరిగైసి 4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆయన హికారు నాకమురా, విదిత్ గుజ్రాతి మీద విజయాలు సాధించాడు. విదిత్ చివరి స్థానంలో ముగించాడు.

క్వార్టర్‌ఫైనల్‌కి అర్హులు:
గ్రూప్ వైట్ నుంచి ప్రగ్యానంద, అబ్దుసత్తరోవ్, సిండరోవ్, ఆరోనియన్;
గ్రూప్ బ్లాక్ నుంచి నాకమురా, నియమన్, కారువానా, ఎరిగైసి.

Leave a Reply