Chennaraopet | గందరగోళం వద్దు..

Chennaraopet | గందరగోళం వద్దు…
- సమన్వయంతో వ్యవహరించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి
- ఎమ్మెల్యే దొంతి
- చెన్నారావుపేట సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే
Chennaraopet | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : సమన్వయ లోపంతోనే చెన్నారావుపేట గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోలేకపోయారని, ఇప్పటికైనా మించిపోయిందేంలేదని ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రాధారపు నాగలక్ష్మిప్రతాప్ రెడ్డికి మద్దతు పలికి గెలిపించేందుకు కృషి చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మూడో విడత ఎన్నికలు జరగనున్న చెన్నారావుపేట మండల కేంద్ర సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ బలపరిచిన నాగలక్ష్మికి మద్దతుగా నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే దొంతి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దొంతి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఘాటుగా హెచ్చరించారు. నర్సంపేట నియోజకవర్గంలో చెన్నారావుపేట గ్రామాన్ని తన సొంత గ్రామంలా భావిస్తానని, నలభై ఐదు ఏళ్లుగా నా రాజకీయ జీవితానికి చెన్నారావుపేట ప్రజలు అండగా నిలిచారని, గ్రామంలో అనేక అభివృద్ధి పనుల్లో కాంగ్రెస్ పాత్ర కీలకమన్నారు. కాంగ్రేస్ సర్పంచ్ అభ్యర్థితో పాటు 12వార్డు సభ్యుల స్థానాలు కాంగ్రేస్ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని, ఎన్నికలు అయిపోగానే మిగిలి ఉన్న అన్ని పనులను పూర్తి చేయించే బాధ్యత నాదేనన్నారు.
ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన వారందరికీ టికెట్లు రావని, కొందరి మాటలు పట్టుకుని పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే రాజకీయ భవిష్యత్ శూన్యమవుతుందని రెబల్స్ కి హెచ్చరించారు. టికెట్స్ రాని వారికి రాబోయే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. గతంలో గ్రామంలో పేదవాళ్లకు ఉచితంగా ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనని,18సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు అందిస్తామన్నారు. అనంతరం నాగలక్ష్మికి కేటాయించబడ్డ టూత్ పేస్ట్ గుర్తును ఎమ్మెల్యే దొంతి అభ్యర్థితో కలిసి ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏఎంసీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు సిద్దన రమేష్, మండల ఎన్నికల ఇంచార్జి చింతల సాంబరెడ్డి, వేముల సాంబయ్య, ఓర్సు తిరుపతి, నాయకులు మొగిలి వెంకట్ రెడ్డి, కేతిడి వీరారెడ్డి, మంద యాకయ్య, తప్పేట రమేష్, గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు కంది నారాయణరెడ్డి, గ్రామ పార్టీ నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
