అక్రమార్కుల చేతుల్లో మోసపోయిన భూదాన్ బాధితులు

అక్రమార్కుల చేతుల్లో మోసపోయిన భూదాన్ బాధితులు

ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు వసూళ్లు
54.13 లక్షలు కట్టి మోసపోయిన 38 మంది బాధితులు ఫిర్యాదు
ఖమ్మం ఏసీపీ రమణ మూర్తి

ఖమ్మం , ఆంధ్రప్రభ : ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలో ఉన్న భూదాన్ భూములు, ప్రభుత్వ భూముల అక్రమార్కుల చేతుల్లో మోసపోయిన బాధితులు గురువారం ఖమ్మం టౌన్ ఏసిపి కార్యాలయంలో ఏసీపీ రమణమూర్తి ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వారితో మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలోని ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ తో పాటుగా, వివిధ పోలీస్ స్టేషన్ల లో భూదాన్ భూములు పేరుతో మోసపోయిన బాధితులు నుంచి ఫిర్యాదులు అందినట్టు తెలిపారు.


అక్రమార్కులు బాధితుల దగ్గర ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు వసూళ్లకు పాల్పడినట్టు, అలా 38 మందిని మోసం చేసి రూ. 54.13 లక్షలు వసూళ్ళు చేశారన్నారు. బాధితులందరూ ” పోలబోయిన ముత్తయ్య” కు సంబధిత నగదును చెల్లించినట్టు ఆయన తెలిపారు. వారు నగదు చెల్లింపుల సమయంలో ముత్తయ్య ఇచ్చిన రసీదుల నకలను పోలీసు వారికి ఇచ్చి, అట్టి వ్యక్తి చేతిలో మోసపోయినట్టు దరఖాస్తు ఇచ్చినట్టు ఆయన తెలిపారు.


అట్టి దరఖాస్తు విచారణలో భాగంగా పోలీసు వారు రసీదులను పరిశీలించగా అవి భూదాన్ వినోభాబవే వెల్ఫేర్ సొసైటీ పేరుతో, U.C.C.R.I ( M-L) పార్టీ , పి.అరవింద్ పేరుతో ప్రింట్ చేయబడి ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే ఆ రసీదులు పోలబోయిన ముత్తయ్య దురుద్దేశం తో అమాయక ప్రజల ను మోసం చేయాలని భావించి అట్టి రసీదులు ఇచ్చినట్టు తేలిందని ఏసిపి తెలిపారు. కాగా ఇప్పటికే భూదాన్ కేసుల్లో ముద్దాయిగా ఉన్న పోలబోయిన ముత్తయ్య ను జ్యుడీషియల్ రిమాండ్ కు పంపినట్టు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేసు లోతైన విచారణ కోసం ముద్దాయిని ఖానాపురం పోలీస్ వారు ముద్దాయిని పోలీస్ కస్టడీ కి కోరినట్టు తెలిపారు. సదరు విచారణలో మరికొన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

Leave a Reply