AP CM | అన్నదాత అందుకేనా..?

AP CM | అన్నదాత అందుకేనా..?

AP CM, నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : రబీ సాగుకు సన్నద్ధం అవుతున్న రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. బుధవారం అన్నదాత సుఖీభవ – పీఎస్ కిసాన్ పథకం’ రెండో విడత నగదు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు (Chandrababu) ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు చొప్పున ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేలు చొప్పున జమ చేయనున్నారు. నేటి సాయంత్రం రైతుల తుది జాబితా వస్తుందని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 2న ఓ పండుగ వాతావరణంలో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. బుధవారం కూడా అదే తరహాలో పంపిణీ చేసేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వరి రైతులు అధిక వర్షాలకు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా రబీ సాగు పై ఆశలు పెంచుకున్నారు. కష్టాల నుంచి కొంతైనా గట్టెక్కవచ్చని రబీ సీజన్ సాగుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం నుంచి కొండంత ఆర్థిక భరోసా లభించనుంది. పంట సాగు చేయడానికి రైతులకు అప్పులు పుట్టక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి రూ.20 వేలు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అందజేస్తామని గత ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. కూటమి మేనిఫెస్టోలో కూడా సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ కింద అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. జిల్లాలో నియోజకవర్గాల వారిగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పంపిణీ చేసేలా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply