వెలగపూడి : రెండు బడ్జెట్లలోనూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు.ఆత్మస్తుతి – పరనింద అన్నట్లుగా కూటమి వార్షిక బడ్జెట్ ప్రసంగం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తాడేపల్లిలో గవర్నర్ ప్రసంగం, వార్షిక బడ్జెట్‌పై మీడియాతో మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారని తెలిపారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్నట్లుగా బడ్జెట్ ఉందని కామెంట్ చేశారు. ఆత్మస్తుతి – పరనింద అన్నట్లుగా కూటమి వార్షిక బడ్జెట్ ప్రసంగం కొనసాగిందని అన్నారు.
హామీల గురించి అడిగితే వాళ్ల దగ్గర సమాధానం లేదని ఫైర్ అయ్యారు. మొదటి బడ్జెట్‌లో హామీలకు కేటాయించింది బోడి సున్నా అని ఎద్దేవా చేశారు. రెండో బడ్జెట్‌లో కూడా అరకొరగానే కేటాయింపులు చేశారని దుయ్యబట్టారు. రెండ్ బడ్జెట్లలో ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. 4 లక్షల మందికి ఉపాధి కల్పించామంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పించడం సిగ్గుచేటని అన్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ప్రగల్భాలు పలికి ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పారని ఫైర్ అయ్యారు. ప్రతి నిరుద్యోగికి రూ.3 వేల నిరుద్యోగ భృతి చెప్పారని ఆ లెక్కన 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి కింద రూ.7,200 కోట్లు ఇవ్వాలని అన్నారు. కానీ, ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు.
ఉన్న ఉద్యాగాలకు కూడా తీసేస్తున్నారనేది సత్యమన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే 1.30లక్షల ఉగ్యోగాలు ఇచ్చామని అన్నారు. 2.66 లక్షల మంది వాలంటీర్లను నియమించామని తెలిపారు. APCOS ద్వారా 96 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని అన్నారు. ఆర్టీసీ విలీనం ద్వారా 58 వేల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశామని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో మొత్తం 6.31 లక్షల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు కల్పంచామని వైఎస్ జగన్ అన్నారు.

పవన్ పై ఘాటు విమర్శలు ..
ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లాలంటూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ జీవిత కాలంలో ఒక్కసారే ఎమ్మెల్యే అయ్యారని . పవన్ కల్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విపక్ష హోదా ఇవ్వాల్సిందే ..
ప్రతిపక్ష హోదాపైనా జగన్ మరోసారి మాట్లాడుతూ, . గతంలో ఢిల్లీలో బీజేపీకి మూడు స్థానాలు మాత్రమే ఉంటే ఆమ్ ఆద్మీ ప్రభుత్వం బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిందని గుర్తు చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ప్రతిపక్ష పార్టీగా హోదా లాగేస్తానంటే తాను వద్దన్నానని వివరించారు.. చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఉన్న సమయంలో ఎంత సమయం మాట్లాడతావో అంతసేపు మాట్లాడమని చెప్పానని పేర్కొన్నారు.. ప్రభుత్వం చేసిన తప్పులను చెప్పేందుకు మాత్రమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నా అంటూ జగన్ అన్నారు.