ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆసియా కప్ (Asia Cup) ప్రారంభానికి మరో 14 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో సంజూశాంసన్ (Sanju Samson) జట్టుకు ఎంపికైనా… బెర్త్ దొరుకుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఆసియా కప్ లో సంజూని మిడిల్ ఆర్డర్ కి పరిమితం చేయొచ్చు, లేదా పూర్తిగా పక్కన పెట్టవచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తన బ్యాట్ తో గట్టి సమాధానం ఇచ్చాడు. కేరళ క్రికెట్ లీగ్ (Kerala Cricket League)లో కొచ్చి బ్లూ టైగర్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న శాంసన్.. ఆదివారం రోజు అరైస్ కొల్లాం సైలర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఈ విధ్వంసం సృష్టించాడు. సంజూ ఓపెనర్ (Sanju Opener)గా వచ్చి సెంచరీ బాదాడు.
42 బంతుల్లోనే సెంచరీ..
ఈ మ్యాచ్ లో 42 బంతుల్లో 13 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో పరుగుల వర్షం కురిపించాడు. మొత్తంగా 51 బంతుల్లో 121 పరుగులు చేసి అద్భుత శతకాన్ని నమోదు చేసి జట్టుకు భరోసా ఇచ్చాడు. ఇక చివరిలో సంజు అవుట్ అయినప్పటికీ.. ఆశిక్ 18 బంతుల్లో 45 పరుగులు చేసి.. చివరి బంతికి సిక్స్ కొట్టి అనూహ్య విజయాన్ని అందించాడు. ముఖ్యంగా సంజు ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేశాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్ ధాటికి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం (Greenfield International Stadium) బౌండరీలు చిన్నబోయాయి. మొదటి బంతి నుండే ఎటాక్ ప్రారంభించిన సంజూ.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. తద్వారా కేరళ క్రికెట్ లీగ్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇక 121 పరుగులు చేశాక సంజూ ని.. కొల్లాం పేసర్ బిజు నారాయణన్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. చివరి ఓవర్ లో కొచ్చి విజయానికి 17 పరుగులు అవసరం ఉన్న సమయంలో.. కొచ్చి బ్యాటర్ మహమ్మద్ ఆషిక్ తన జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.