Center Boon | ఏపి, తమిళనాడును కలుపుతూ కొత్తగా జాతీయ రహదారి
వెలగపూడి – కేంద్రంలో, రాష్ట్రంలో.. రెండుచోట్లా ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పరుగులు తీస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పదే పదే చెబుతుంటారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అభివృద్ధిని ఉదహరిస్తుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో, కేంద్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వాలే ఉన్నాయి. అంతేకాకుండా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యులు కీలకం కావడం కూడా రాష్ట్రానికి బాగా కలిసివస్తోంది. అభివృద్ధి పనులను మోడీ, బాబు పరుగులు తీయస్తున్నారు. రాష్ట్రంలోని రహదారులను జాతీయ రహదారులుగా మారుస్తూ ఇప్పటికే పలు నిర్ణయాలను తీసుకున్న కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 84 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ ను, తమిళనాడును కలుపుతూ కొత్తగా జాతీయ రహదారిని నిర్మించబోతున్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మీదుగా తమిళనాడు సరిహద్దు వరకు 42వ నెంబరు జాతీయ రహదారిని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. పలమనేరు నుంచి కుప్పం వరకు రెండు వరుసలుగా ఉన్న రహదారిని నాలుగు వరుసలుగా మార్పు చేయబోతున్నారు. అలాగే కుప్పం నుంచి తమిళనాడు సరిహద్దు వరకు ఉన్న మరో 20 కిలోమీటర్ల మార్గాన్ని కూడా నాలుగు వరుసలుగా మారుస్తారు. మొత్తంగా పలమనేరు నుంచి 84 కిలోమీటర్ల మార్గాన్ని నాలుగు లైన్లుగా మారుస్తున్నారు. ఈ మార్గంలో ఐదు ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు రానున్నాయి. మరోపక్క బెంగళూరు – చెన్నై జాతీయ రహదారి పనులు కూడా జరుగుతున్నాయి.