అమ్మ సన్నిధిలోవైభవంగా శ్రీరామనవమి వేడుకలు..

అమ్మ సన్నిధిలోవైభవంగా శ్రీరామనవమి వేడుకలు..
అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం
భక్తజన సందోహంతో కళకళలాడిన దేవస్థానం
ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడ లోని ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. వసంత నవరాత్రోత్సవాల సందర్బంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతితో మెరిసిపోగా, వేలాదిమంది భక్తులు తరలివచ్చి దివ్య దర్శనంతో పులకించిపోయారు. శుక్రవారం శ్రీరామనవ మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు అభిజిత్ లగ్నంలో రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కళావేదికపై శ్రీ సీతారాముల కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఆలయ ఈవో శీనా నాయక్ దంపతులు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ దంపతులు పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు.
ఉప ప్రధాన అర్చకులు కోట ప్రసాద్, ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాసశాస్త్రి వేద పండితుల బృందం కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు అభిజిత్ లగ్నంలోనే జన్మించాడని విశ్వాసం. అందువల్ల ప్రతి ఏటా ఇదే సమయానికి కల్యాణోత్సవం నిర్వహించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ లగ్నంలో స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు నివృత్తి అవడంతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమయ్యే వసంత నవరాత్రుల్లో శ్రీరామనవమి ముఖ్య ఘట్టంగా నిలుస్తుంది.
ప్రకృతి పులకరించే వసంత కాలంలో శక్తి స్వరూపిణి అయిన కనకదుర్గమ్మ సన్నిధిలో మర్యాదా పురుషోత్తముడైన రామయ్య కల్యాణం జరగడం ఇంద్రకీలాద్రి ప్రత్యేకతగా నిలుస్తోంది. సీతారాముల కల్యాణం కేవలం దైవిక వివాహం మాత్రమే కాకుండా, ధర్మం, సౌభాగ్యం, శాంతికి ప్రతీకగా భావిస్తారు. ఈ కల్యాణాన్ని వీక్షించడం వల్ల కుటుంబాల్లో ఐశ్వర్యం, సౌఖ్యం పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.
ఈ సందర్భంగా భక్తులకు అందించే వడపప్పు, పానకం వంటి ప్రసాదాలు కేవలం ఆచారం మాత్రమే కాకుండా, ఎండకాలంలో శరీరానికి చలువనిచ్చే ఆరోగ్య పరిరక్షణలో భాగమని పండితులు వివరించారు. వేలాదిమంది భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించి, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉత్సవాలు ఘనంగా పూర్తి చేశారు.
