పహారా…అంత తేలికైనది కాదు..ఎక్కడేం జరిగినా, చీమ చిటుక్కుమన్నా పట్టేయడం సులభమైనదేమీ కాదు. వీధుల్లో, రహదారుల్లో ఎక్కడేం జరిగినా సాక్షులను విచారించడం, నిజ నిర్ధారణ చేసుకోవడం చాలా పెద్ద పని. అందుకే పోలీసుల పని సీసీకెమెరాలు సులభం చేస్తున్నాయి. సీసీటీవీల (CCTV) ఫుటేజీలతో సగం పని పూర్తయిపోతుంది. కరుడుగట్టిన నేరగాళ్ళను ఉంచిన జైళ్ళల్లో ( jails) అంతమందిమీద నిఘా ఉంచడం… వారి కదలికలను, వారి మధ్య రహస్యంగా జరుగుతున్న వ్యవహారాలను పసిగట్టడం జైళ్ళ సిబ్బందికి, అధికారులకు తలనొప్పిపని.
వాళ్ళు అప్పటికే ఆరితేరిన వాళ్ళు, అలాంటి మరికొందరితో జత కట్టినప్పుడు వాళ్ళల్లోని ఆలోచనలకు అలాంటివారే తోడయ్యే కేంద్రాలే జైళ్ళు. జైళ్ళనుంచే నేరాల పథక రచనలు ఎక్కువ. అక్కణ్ణుంచే దందాలు, సెటిల్మెంట్లు.. హత్యలకు పథక రచనలు జరుగుతుంటాయి. కొంతమంది అధికారులను (Officers) లోబర్చుకోవడం, వాళ్ళకు డబ్బు ఎరగా చూపి తమకు కావాల్సిన సౌకర్యాలను సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం బహిరంగ రహస్యం.
అయితే బెంగాల్ (Bengal) లోని జైళ్ళల్లో కరుడుగట్టిన నేరగాళ్ళు బయట జరిగే నేరాలకు పథక రచనలు చేయడం, గంజాయి అక్రమ రవాణా, బెదిరింపులు, హత్యల పథక రచన చేస్తూ జైళ్ళను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుస్తున్నారు.
వాళ్ళ కదలికలను కనిపెట్టేందుకు అక్కడి ప్రభుత్వం ఏఐ ఆధారిత కెమెరాల (AI-based cameras) ను ఏర్పాటు చేస్తోంది. బెంగాల్ రాష్ట్రంలో ఉన్న దాదాపు 60 పరివర్తన కేంద్రాల్లో అత్యంత ఆధునికమైన కెమెరాలు ఉన్నాయి. అయినా వాటి దృష్టి నుంచి కూడా నేరస్థులు తప్పించుకుని యధేచ్చగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అందుకే ఏఐ ఆధారిత కెమెరాలను అమర్చుతున్నారిప్పుడు.
ఏమిటి వీటివల్ల ప్రయోజనం?
ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ఈ ఏఐ ఆధారిత కెమెరాల వల్ల సత్వర ఫలితాలుంటాయి. ప్రతి ఖైదీ బయోమెట్రిక్ (Prisoner biometric) వివరాలను ఇందులో పొందుపర్చడం జరుగుతుంది. ఆ వివరాలను ఏఐతో అనుసంధానిస్తారు. తద్వారా సాధారణ సీసీ కెమెరాల్లాగా ఫుటేజీని ఇవ్వడమే కాక ఇవి అనుమానాస్పద ఆలోచనలను, కదలికలను గుర్తించి ఎప్పటికప్పుడు జైల్ గార్డులకు చేరవేసి వారిని అప్రమత్తం చేస్తాయి. ఇవి అమలులోకొచ్చి పనిచేయడం ప్రారంభిస్తే అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా కాకుండా జైళ్ళు నిజమైన పరివర్తన కేంద్రాలుగా మారే అవకాశముంటుంది.

