Exclusive | పనసపళ్ల చాటున.. గంజాయి సప్లయ్!

  • గుట్టు రట్టు చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
  • కోటి రూపాయల గంజాయి స్వాధీనం
  • ఇద్దరు నిందితుల అరెస్ట్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎక్సైజ్ శాఖ తన పటిష్టమైన సమాచార వ్యవస్థతో మత్తు పదార్థాల అక్రమ రవాణా చేసే ముఠాలపై కన్నేసి ఎప్పటికప్పుడు వారిని పట్టుకుని కటకటాల పాలు చేస్తుంది. ఆ భయంతో మత్తు పదార్థాల అక్రమ రవాణా దారులు ఎక్సైజ్ శాఖ కల్లుగప్పి, కొత్త ఎత్తుగడలతో తమ వ్యాపారం కొనసాగించే ప్రయత్నం చేసిన ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ వి బి కమలాసన్ రెడ్డి దిశా నిర్దేశంతో మత్తు పదార్థాల అక్రమ రవాణా చేసే స్మగ్లర్ల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు పసిగడుతూ అక్రమ వ్యాపారస్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఇదే క్రమంలో సోమవారం ఒడిషా నుంచి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాస, విశాఖపట్నం విజయవాడ మీదుగా రాష్ట్రానికి కోటి రూపాయల విలువ చేసే గంజాయిని పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారనే సమాచారం అందగా, స్టేట్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ ఎస్పీ భాస్కర్ కు ఆ సమాచారాన్ని తెలిపి, గంజాయి తరలిస్తున్న ముఠా కదలికలపై నిఘా వేసి వారిని పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలపై అడిషనల్ ఎస్పి భాస్కర్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం “సి” డి.ఎస్. పి. తులా శ్రీనివాసరావు, ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు సిబ్బందికి అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా డీఎస్పీ తిరుపతి యాదవ్, ఇన్ స్పెక్టర్ నాగరాజులను కూడా సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి, గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకోమని ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలపై స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం ” సి ” ” డి ” మేడ్చల్ ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా, పటిష్టమైన ప్రణాళికతో, చక్కటి కార్యాచరణతో నిర్వహించిన తనిఖీలతో పెద్ద ఎత్తున గంజాయిని తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి కోటి రూపాయల విలువ చేసే (410) కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఫొటో : ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి

నిందితుల నేపథ్యం..

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గణేష్ రామస్వామి అనునతడు ఒక ప్రైవేటు డ్రైవర్ గా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ అతనికి వచ్చే జీతం డబ్బులతో సంతృప్తి చెందక మరేదైనా అక్రమ మార్గంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలని దురాశతో ఉండగా వారికి రత్నాభాయి అనే గంజాయి వ్యాపారం చేసే ఒక వ్యక్తి పరిచయం అయింది. గంజాయి వ్యాపారంలో డబ్బులు ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చని గణేష్ రామస్వామికి చెప్పగా గణేష్ లో అప్పటికే ఉన్న దురాశ మరింతగా పెరిగింది. అందుకుగాను, అతనితో పాటు డ్రైవింగ్ వృత్తిలో ఉన్న విజయ్ శంకర్ కులకర్ణి అనే వ్యక్తి సహకారం కోరాడు. అందుకు అతను కూడా తన సహకారం అందించుటకు అంగీకరించాడు. తర్వాత గణేష్ రామస్వామి తమ గంజాయి అక్రమ రవాణాకు సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక మహీంద్రా మినీ వ్యాను కూడా కొనుగోలు చేశాడు. అప్పటికే గంజాయి అక్రమ వ్యాపారంలో ఆరితేరిన రత్నాబాయ్ సహకారంతో ఒడిశాలోని గంజాయి సరఫరాదారులతో పరిచయం చేసుకొని గంజాయి అక్రమ వ్యాపారానికి తెరలేపారు.

నిందితులు పట్టుబడిన తీరు..

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ ఆదేశాలతో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ నిందితుల కదలికలపై 20రోజులుగా నిఘా పెట్టి వారి కదలికలను క్షుణ్ణంగా నిశితంగా గమనిస్తున్న క్రమంలో సోమవారం నిందితులు వ్యానులో గంజాయిని తరలిస్తున్నారని పకడ్బందీ సమాచారం రాగా ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మాటు వేసిన ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్, మేడ్చల్ ఎక్సైజ్ అధికారులు గంజాయి అక్రమ రవాణా చేసే ముఠా కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డులో మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కలిగిన మహేంద్ర మినీ వ్యాన్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారుల కంటపడింది. వెంటనే అట్టి వ్యాను ఆపి తనిఖీ చేయగా, పనస పళ్ల లోడుతో కనిపించింది. అందులో ఉన్న వ్యక్తులను విచారించగా, వారు తాము పళ్ల వ్యాపారం చేస్తామని, శ్రీకాకుళం జిల్లా పలాస నుండి పనస పళ్ళను మార్కెట్ కు తరలిస్తున్నామని చెప్పారు. అనుమానాస్పదంగా ఉన్న వారి హావభావాలను గమనిస్తూ వ్యానును క్షుణ్ణంగా తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు ఆశ్చర్య పోయారు. రహదారిపై తనిఖీ అధికారుల కళ్లు గప్పడానికి నిందితులు పనస పళ్ల లోడ్ కింది భాగంలో గంజాయిని నింపి, అనుమానం రాకుండా ఆ గంజాయిపై పనస పళ్ళను పోసి తీసుకు వెళుతున్నట్టుగా గమనించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు శ్రీకాకుళం జిల్లా పలాసకు చేరుకుని అక్కడికి సమీపంలో ఉన్న ఒడిశా నుంచి గంజాయి వ్యాపారం చేసే వారి వద్ద నుండి గంజాయిని కొనుగోలు చేసి, దారిలో అధికారుల తనిఖీలో పట్టు పడకుండా ఉండడానికి పలాసలో పనస పళ్ళను కొనుగోలు చేసి తమ వ్యానులో గంజాయిపైన పనస పళ్ళను నింపి తరలిస్తున్నామని తెలిపారు. వెంటనే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్, మేడ్చల్ ఎక్సైజ్ అధికారులు నిందితుల వద్ద నుండి కోటి రూపాయల విలువ చేసే 410కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.

నిందితుల వివరాలు…

మహారాష్ట్ర ఉస్మానాబాద్ కు చెందిన గణేష్ రామస్వామి, విజయ్ శంకర్ లు గంజాయిని కిలో చొప్పున విడదీసి చిన్న ప్యాకెట్ల లోనికి మార్చి బీదర్, తాండూర్, వికారాబాద్, హైదరాబాద్ లో మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 410కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమంగా రవాణా చేయటానికి ఉపయోగించిన మహీంద్రా మినీ వ్యాను, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *