కొత్తగా ముగ్గురు లేదా నలుగురికి చోటు
రేవంత్ సీనియర్లతో మంతనాలు
నిన్న మీనాక్షి నటరాజన్ తో రెండు గంటల పాటు చర్చలు
హస్తిన పెద్దల సూచనలతో మంత్రి వర్గ విస్తరణకు అడుగులు
రెడ్డి, బిసి, ఎస్సీ, మైనార్టీ లకు కొత్త మంత్రి వర్గంలో అవకాశం
రేపు గవర్నర్ అందుబాటులో ఉండాల్సిందిగా కోరిన ప్రభుత్వం
హైదరాబాద్ – ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం .. దీంతో రేపే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేతలు అంటున్నారు.. ఇప్పటికే గవర్నర్ రేపు అందుబాటులో ఉండాల్సిందిగా ప్రభుత్వం గవర్నర్ కార్యదర్శికి సమాచారం ఇచ్చింది. ఇక హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్త మంత్రుల ఎంపిక కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ మంత్రులతో, టిపిసిసి అధ్యక్షుడితో మంతనాలు జరుపుతున్నారు.. ఇదే విషయంపై శుక్రవారం నాడు రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ తో రెండు గంటల పాటు చర్చలు జరిపారు.. హైకమాండ్ మంత్రి వర్గ విస్తరణపై తెలిపిన అభిప్రాయాలను రేవంత్ తో మీనాక్షి పంచుకున్నారు.. ఇక రేవంత్ మంత్రి వర్గంలో ఆరుగురికి చోటు ఉండగా ప్రస్తుత విస్తరణలో ముగ్గురికి లేదా నలుగురికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం .. కొత్త మంత్రి వర్గంలో రెడ్డి, ఎస్సీ, బిసి, మైనార్టీలకు చోటు దక్కవచ్చని అంటున్నారు.. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.