కసాయి తండ్రి.. కటకటాలకు..

కసాయి తండ్రి.. కటకటాలకు..
- కవల ఆడపిల్లల హత్య కేసు ఛేదన
- ఆస్తి.. ఆడపిల్లలపై వివక్షే కారణం..
- కన్న తండ్రి సహా నలుగురు నిందితుల అరెస్ట్
కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : కన్న బిడ్డలనే చేతులారా చంపిన కసాయి తండ్రి కటకటాల పాలయ్యాడు.. జూబ్లీనగర్ దారుణ ఘటనలో కన్నతండ్రితోపాటు అతనికి సహా వాకరించిన కుటుంబ సభ్యులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తిపై మక్కువతో, ఆడపిల్లలనే వివక్షతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. కరీంనగర్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ గౌస్ ఆలమ్ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ నివాసి కచ్చు శ్రీశైలం (28), ప్రతిమ మెడికల్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు.
2020లో మౌనికతో వివాహం కాగా, 2022లో వీరికి కవల ఆడపిల్లలు (గీతంశి, గీతన్వి) జన్మించారు. అయితే మొదటి నుండి మగపిల్లవాడు కావాలని కోరుకున్న శ్రీశైలంకు, ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదు. సుమారు 2 కోట్ల విలువైన ఆస్తి ఆడపిల్లల పెళ్లిళ్లకే సరిపోతుందని భావించిన శ్రీశైలం, తన తల్లిదండ్రులు అశోక్, లావణ్య, తమ్ముడు రాకేష్ తో కలిసి ఆ పిల్లలను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు.
పథకం ప్రకారం హత్య..
ఏప్రిల్ 3న, పథకం ప్రకారం నిందితుడు శ్రీశైలం తన భార్యను ఇంట్లోనే ఉండమని చెప్పి, బలవంతంగా ఇద్దరు కుమార్తెలను మోటార్ సైకిల్పై పొలం వద్దకు తీసుకెళ్లాడు. చుట్టు పక్కల ఎవరూ లేని సమయం చూసి, నలుగురు నిందితులు ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం.. శ్రీశైలం ఇద్దరు చిన్నారులను వ్యవసాయ బావిలోకి తోసివేశాడు. నీటిలో మునిగిపోతున్న గీతంశి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుండగా, తానే బావిలోకి దిగి ఆమెను నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.
అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, పిల్లలను కాపాడబోతున్నట్లుగా నటిస్తూ కేకలు వేశాడు. అయితే నిందితుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులు గోపాల్పూర్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. ఆదివారం నిందితులను అదుపులోకి తీసుకోగా, వారు తమ నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.
అరెస్టయిన వారిలో కచ్చు శ్రీశైలం (తండ్రి), కచ్చు అశోక్ (తాత), కచ్చు లావణ్య (నానమ్మ), కచ్చు రాకేష్ (బాబాయ్) లున్నారు. అలాగే హత్యకు ఉపయోగించిన గ్లామర్ బైకు, ఒక వివో మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును అత్యంత వేగంగా ఛేదించిన రూరల్ ఏసీపీ విజయ కుమార్, సి.ఐ. నిరంజన్ రెడ్డి, సిబ్బందిని కరీంనగర్ సిపి గౌష్ ఆలం అభినందించారు. గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించారు.
