Bus accident | తప్పిన పెను ప్రమాదం..
- దొడ్లవారిమిట్ట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..
- ఆరుమంది ప్రయాణీకులకు గాయాలు..
- గాయపడిన వారికి నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స..
- బస్సు మార్పులతో ప్రయాణీకులు ఇబ్బందులు..
- ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటున్న ప్రయాణీకులు..
Bus accident, పెళ్లకూరు, ఆంధ్రప్రభ : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు ఆగడం లేదు. తాజా ఘటనలో విజయవాడ (Vijayawada) నుంచి బెంగుళూరుకు వెళుతున్న మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం దొడ్లవారిమిట్ట జాతీయ రహదారి పై అదుపుతప్పి పంటపొలాల్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. 21 మంది ప్రయాణికులతో విజయవాడ నుంచి బయలుదేరిన ఈ బస్సు దొడ్లవారిమిట్ట వద్దకు చేరుకోగానే డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపుతప్పి రోడ్డుపక్కకు వెళ్లి బోల్తాపడిందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురంకు చెందిన శ్రీనివాసులు, ఏలూరుకు (Eluru) చెందిన శ్రీనివాసులు, గుంటూరుకు చెందిన తోరటి మల్లీశ్వరీ, ఎం. అంజమ్మ, షణ్ముఖనాధ్, ఈశ్వర్‌రావులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన పై ఎస్‌ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు మార్పులపై ప్రయాణికుల ఆగ్రహం..
ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాము బుక్ చేసిన బస్సుకు బదులుగా మరో బస్సులో ఎక్కించారని, ఆ బస్సును విజయవాడలో ఆపివేసి మళ్లీ మరో బస్సులోకి మార్చారని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణం మధ్యలో బస్సు ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ పని చేయకపోవడంతో శ్వాస తీసుకోవడం కష్టమైందని డ్రైవర్ తాత్కాలికంగా మరమ్మత్తులు చేసి తిరిగి ప్రయాణం ప్రారంభించారని తెలియచేశారు. ఇది జరిగిన కొద్దిసేపటికే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదానికి కారణమైందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.



