పరుష పదజాలం–నిర్లక్ష్యం…

పరుష పదజాలం–నిర్లక్ష్యం…
ప్రజలకు నరకంగా టౌన్ ప్లానింగ్
ఖమ్మం కార్పొరేషన్‌లో గందరగోళ వాతావరణం
కింది స్థాయి సిబ్బంది వైఖరిపై ఫిర్యాదుల వెల్లువ
లక్షలు చెల్లించినా దరఖాస్తుదారులకు అవమానం
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు అటకెక్కిన వైనం
అ ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ లతో మొదలైన గందరగోళం
ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం నగర పాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇటీవలి కాలంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొత్తగా నియమితులైన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ లలో ఓ ఇద్దరు వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కార్యాలయానికి వచ్చే దరఖాస్తుదారులతో వారు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న సమాచారం కోసం అడిగినా సహనం లేకుండా సమాధానాలు ఇస్తున్నారని పలువురు చెబుతున్నారు. పరుష పదజాలంతో మాట్లాడడం సర్వసాధారణంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయ మర్యాదను పూర్తిగా విస్మరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి వల్ల టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోందని అంటున్నారు. మొత్తం మీద అవుట్ అ ఇద్దరు వల్లే సమస్యలు మొదలయ్యాయన్న వాదన బలంగా వినిపిస్తోంది.
లక్షలు చెల్లించినా కనీస సమాచారం లేదు…
భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తుదారులు లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తున్నారు. అంత పెద్ద మొత్తాలు చెల్లించినప్పటికీ కార్యాలయంలో వారికి కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. తమ దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు వెళ్లినా సరైన సమాధానం రావడం లేదని చెబుతున్నారు. ప్రశ్నలు అడిగితే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో దరఖాస్తుదారులను పట్టించుకోకుండానే వదిలేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. సమాచార హక్కు ఉన్నప్పటికీ దాన్ని కాలరాస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పారదర్శకత పూర్తిగా లోపించిందని విమర్శలు పెరుగుతున్నాయి.
ఉన్నతాధికారుల ఓర్పు… కింది సిబ్బంది నిర్లక్ష్యం…
టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్నతాధికారులు ఎంతో ఓర్పుతో దరఖాస్తుదారులకు సమాధానాలు చెబుతున్నారని పలువురు చెబుతున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు వారు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అయితే కింది స్థాయి సిబ్బంది వైఖరి వల్ల ఆ ప్రయత్నాలన్నీ వృథా అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల పేరు ప్రతిష్టకే భంగం కలుగుతోందని సీనియర్ ఉద్యోగులే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కార్పొరేషన్ మొత్తానికి చెడ్డ పేరు వస్తోందని పలువురు అంటున్నారు. ప్రజలకు సహాయం చేయాల్సిన సిబ్బందే ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఈ అంతర్గత విభేదాలు వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. తక్షణమే కింది స్థాయి సిబ్బందిపై నియంత్రణ అవసరమన్న డిమాండ్ వినిపిస్తోంది.
టౌన్ ప్లానింగ్ అంటేనే భయం…
ఈ పరిస్థితుల నేపథ్యంలో సామాన్య ప్రజలు టౌన్ ప్లానింగ్ విభాగంలో అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారని చెబుతున్నారు. కార్యాలయానికి వెళ్తే అవమానం తప్పదన్న భావన ప్రజల్లో ఏర్పడింది. చిన్న సందేహం అడగడానికే వెనుకడుగు వేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయం అంటే సేవా కేంద్రం అనే భావన పూర్తిగా మాయమైందని అంటున్నారు. భయభ్రాంతులతో ప్రజలు బయట నుంచే తిరిగి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇది పాలన వైఫల్యానికి నిదర్శనమని సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించాల్సిన బాధ్యతను విస్మరించారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ భయ వాతావరణం కొనసాగితే ప్రజల సమస్యలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు అటకెక్కిన వైనం…
సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు కూడా పరిష్కారం కావడం లేదని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. నెలల తరబడి ఫైళ్లు కదలకుండానే ఉండిపోతున్నాయని చెబుతున్నారు. తమ దరఖాస్తు స్థితిగతులు తెలుసుకోవడానికి కార్యాలయానికి వస్తే సరైన సమాచారం ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఒకరి దగ్గర ఒకరికి పంపుతూ సమయాన్ని వృథా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫీజులు చెల్లించినా ఫలితం కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తిగా మందగించిందని అంటున్నారు. దీని వల్ల భవన యజమానులు ఆర్థికంగా నష్టపోతున్నారని చెబుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే సమస్య తీవ్రరూపం దాల్చుతుందని హెచ్చరిస్తున్నారు.
పురుగుల్లా చూస్తున్నారని వాపోతున్న ప్రజలు…
అనుమతుల కోసం లక్షల రూపాయలు చెల్లించిన తమను కార్యాలయంలో పురుగుల్లా చూస్తున్నారని పలువురు దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అడగడానికి వెళ్లితే అవహేళనగా చూస్తున్నారని చెబుతున్నారు. తమకు గౌరవం లేదన్న భావన తీవ్రంగా బాధిస్తోందని అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రజాసేవకులుగా ఉండాల్సిన సిబ్బంది ఇలా వ్యవహరించడం సరికాదని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు. కింది స్థాయి సిబ్బందికి శిక్షణ, క్రమశిక్షణ అవసరమన్న డిమాండ్ పెరుగుతోంది.
టౌన్ ప్లానింగ్ విభాగం లో ఆ ఇద్దరు…
బిల్డింగ్ పర్మిషన్ అంటే రిజక్టే..ప్రతి భవన అనుమతి కి షార్ట్ ఫాల్.. ఖమ్మం నగరం లో ప్రస్తుతం కార్పొరేషన్ లో బిల్డింగ్ పర్మిషన్ కు ప్రజలు దరఖాస్తు పెట్టుకోవాలంటే భయపడే పరిస్థితి నగర పాలక సంస్థ లో ఏర్పడినట్లు పలువురు బహిరంగానే ఆరోపణలు చేస్తున్నారు బిల్డింగ్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే దానికి అన్ని రకాల పక్క నిబంధన ప్రకారం ఉన్న ఎదో ఒక కోర్రి పెట్టి దరఖాస్తు దారుని తీవ్ర ఇబ్బందులు కు గురించేస్తున్నారనే ఆరోపణలు.. నిత్యం టౌన్ ప్లానింగ్ విభాగం లో కొత్త గా వచ్చిన ఒక ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల వలన జరుగుతుంది అని దరఖాస్తు దారులు గగ్గోలు పెడుతున్నారనే ఆరోపణలు బలం గా వినిపిస్తున్నాయి.. ఒక బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కు రాజకీయ అండదండలు ఉన్నాయని తనను ఎవరు ఏమి చేయలేరు అని ఆ అధికారి హెచ్చరిక జారిచేస్తూ పై స్థాయి అధికారులు ను సైతం లెక్క చేయటం లేదనే విమర్శలు ఉన్నాయి.. ప్రజల సహనానికి కూడా హద్దులు ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు.
