Buddhist tourism | బౌద్ధ పర్యాటక అభివృద్ధికి ప్రణాళిక అభినందనీయం

Buddhist tourism | బౌద్ధ పర్యాటక అభివృద్ధికి ప్రణాళిక అభినందనీయం

  • ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

Buddhist tourism | అవనిగడ్డ – ఆంధ్రప్రభ : రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక అభివృద్ధికి ప్రణాళిక తయారు చేయటం అభినందనీయం అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం అవనిగడ్డలో ఎమ్మెల్యేను వారి కార్యాలయంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీ.ఉమారాణి ఆధ్వర్యంలో చరిత్ర అధ్యాపకురాలు డాక్టర్ డీ.రాజ్యలక్ష్మి కలిసి తాను తయారు చేసిన రాష్ట్ర బౌద్ధ పర్యాటక అభివృద్ధి ప్రణాళిక అందచేశారు. రాష్ట్రంలో బౌద్ధ సర్క్యూట్ ఏర్పాటు ఆవశ్యకత వివరిస్తూ, బౌద్ధ పర్యాటక అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో పెరిగే ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు వివరిస్తూ నివేదిక తయారు చేసినట్లు వివరించారు.

రాష్ట్రంలోని గుంటుపల్లి, ఘంటసాల, భట్టిప్రోలు, అమరావతి, గుమ్మడిదుర్రు, బావికొండ, తోటకొండ, నాగార్జునకొండ, బొజ్జనకొండ, శాలిహుండం బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేసి, వీటన్నిటినీ బౌద్ధ సర్క్యూటుగా అభివృద్ధి చేస్తే ఆర్థిక అభివృద్ధిలోనూ ఈ సర్క్యూట్ కీలకంగా నిలుస్తుందనే అంశాలు నివేదికలో పొందుపర్చినట్లు ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాచీన బౌద్ధ చరిత్రకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బౌద్ధం విలసిల్లిన చరిత్రకు జ్ఞాపకాలుగా నిలిచిన బౌద్ధ క్షేత్రాల ఖ్యాతి, ఔన్నత్యం భావితరాలకు తెలియచెప్పేందుకు అనుగుణంగా కేంద్రప్రభుత్వ ప్రోత్సాహం, సహకారం కీలకంగా నిలుస్తుందన్నారు.

రాష్ట్ర బౌద్ధ సర్క్యూట్ ఏర్పాటు – అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పర్యాటక, ఆర్ధిక శాఖల ప్రోత్సాహం కోరుతూ అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ.ఉమారాణి ప్రోత్సాహంతో చరిత్ర అధ్యాపకురాలు డాక్టర్ డీ.రాజ్యలక్ష్మి సమగ్ర నివేదిక తయారు చేయటం అభినందనీయం అన్నారు. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కేంద్ర సహకారం, ప్రోత్సాహం సాధించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ఏ.వీరకుమారి, ఐక్యూసీఎస్ కో-ఆర్డినేటర్ ఆర్.అంకారావు, లైబ్రేరియన్ కే.విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

Leave a Reply