BRS Party | మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం – కెసిఆర్
హైదరాబాద్ – తెలంగాణలో మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో నేడు జరుగుతున్న బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్నది. ఈ భేటీలో బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కార్యక్రమాల నిర్వహణపై, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరి అంశాలపై నేతలతో కేసీఆర్ చర్చించి.. శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానాన్ని పార్టీ నేతలకు గుర్తు చేశారు. ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని.. ప్రజల కోసం పోరాటం చేయాలని శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు బీఆర్‌ఎస్‌కు మాత్రమే తెలుసునన్నారు. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో మళ్లీ వెనక్కి వెళ్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వహించిన తెలంగాణ ప్రజల పార్టీ బి ఆర్ ఎస్ అన్నారు. తెలంగాణ సమాజం లోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, తెలంగాణ అస్తిత్వ పటిష్టతకు కృషి చేస్తూ, గతం గాయాలనుండి కోలుకున్న తెలంగాణాను తిరిగి అవే కష్టాలపాలు కాకుండా, గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా, తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. పార్టీని గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి అటు పార్టీ విజయాన్ని ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పని చేయాలని పాల్గొన్న నాయకులకు అధినేత దిశా నిర్దేశం చేశారు.
పార్టీ ఆవిర్భవించి 25వ సంవత్సరం లోకి అడుగిడుతున్న నేపధ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏడాది కాలం పాటు నిర్వహించాలని తెలిపారు. విద్యార్థి, మహిళా సహా పార్టీ అనుబంధ విభాగాలను మరింత పటిష్ట పరచాలన్నారు. అందుకోసం సీనియర్ పార్టీ నేతలతో కూడిన సబ్ కమిటీ లను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించాలని కేసీఆర్ తెలిపారు.
ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మరియు మాజీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు హాజరయ్యారు.
25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ గురించి చర్చించడంతో పాటు, పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామ స్థాయి నుండి పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక కార్యచరణపై పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు.









