BRS Party – తెలంగాణను స్వప్నించి సాకారం చేసిన మహోన్నతుడు కెసిఆర్..
తెలంగాణ భవన్ లో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు
కెటిఆర్, హారీశ్ రావు, తలసాని, మధుసూధనాచారి తదితరులు హాజరు
తెలంగాణ కోసం కెసిఆర్ కృషిని యాది చేసుకున్న నేతలు
తండ్రి ఆయురారోగ్యం కోసం ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ – కేసీఆర్ కేవలం తనకు మాత్రమే కాదు యావత్ తెలంగాణ జాతికి హీరో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కారణజన్ముడు కేసీఆర్ కొడుకుగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు. కేసీఆర్ 71వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలిలో విపక్ష నేత మధుసూధనా చారి, ఎమ్మెల్యే హరీశ్ రావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు, మద్దతు లేద గుర్తుచేశారు. మీడియా, మనీ, మజిల్ పవర్ లేకుండా తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. తెలంగాణను స్వప్నించి సాకారం చేసిన మహోన్నతుడు కేసీఆర్ అని చెప్పారు. రాష్ట్రంలో ఎవరిని కదిపినా మళ్లీ కేసీఆర్ రావాలంటున్నారని వెల్లడించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో అందరం కలిసి పనిచేద్దామన్నారు.
ఆయన దీక్షలో సమయంలో నా కళ్లలో కన్నీరు…
కేసీఆర్ అంటే నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణకు ఉన్న బంధం పేగు బంధమని చెప్పారు. కేసీఆర్ ది తెలంగాణ ప్రజలది తల్లీబిడ్డల బంధమని తెలిపారు. 1969 మలిదశ ఉద్యమ సమయంలో కేసీఆర్ వయసు 15 ఏండ్లని, అప్పుడే జై తెలంగాణ అని నినదించిన నాయకుడని చెప్పారు. వేల గంటల మేధోమథనం తర్వాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు. తెలంగాణ కోసం అన్ని పదవులు త్యాగం చేసిన నాయకుడని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి ఎంతోమంది మేధావులు కేసీఆర్ వెంట నడిచారన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను ఎన్నో రకాలుగా వేధించారని చెప్పారు. తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ మొండి పట్టుదలే కారణమని తెలిపారు.
తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష చేసినప్పుడు ఆయన్ను చూస్తే నాకు ఏడుపొచ్చిందని పేర్కొన్నారు. అప్పటికీ కేసీఆర్ నిరాహార దీక్ష చేసి 11 రోజులైంది. కంట్రోల్లో లేడు, వణుకుతున్నాడు, కానీ పట్టుదల మాత్రం వీడలేదని అప్పటి విషయాలను యాది చేసుకున్నారు.. అప్పుడు ఆయనను చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయన్నారు. అప్పటి సెంట్రల్ హోంమినిస్టర్ చిదంబరం కాల్ చేసి కేసీఆర్ మీరు దీక్షవిరమించాలని కోరినా.. ఆయన నమ్మలేదని పేర్కొన్నారు హరీశ్ రావు. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తేనే దీక్ష విడుతానని చెప్పారని గుర్తుచేశారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు.
ఎర్రవల్లిలో యాగంలో కెసిఆర్ దంపతులు

ఎర్రవల్లిలో 71 కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రామంలోని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి, యాగం నిర్వహించారు గ్రామస్తులు. ఈ యాగంలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఎర్రవల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆయుష్య హోమం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలవురు బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని, రాష్ర్టానికి మరిన్ని సేవలు అందించాలని భగవంతుడిని ప్రార్థించారు. దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఇక హోమం అనంతరం వేద పండితులు కెసిఆర్ దంపతులను ఆశీర్వించారు..
కవిత ప్రత్యేక పూజలు…

కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోగల వారి నివాసం సమీపంలో ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం ఉదయం స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆలయానికి వెళ్లిన కవిత.. తన తండ్రి ఆయురారోగ్యం కోసం ప్రత్యేక పూజ నిర్వహించారు.