మంచినీటి సమస్యపై బీఆర్ఎస్ ధర్నా…

మంచినీటి సమస్యపై బీఆర్ఎస్ ధర్నా…
మేడ్చల్, మార్చి 9(ఆంధ్రప్రభ): సైబరాబాద్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 297,298 కిష్టాపూర్, పూడూరు డివిజన్ పట్టణాల్లో నెలకొన్న మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సర్కిల్ కార్యాలయం ముందు సోమవారం రోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాళీ బిందెలు, కుండలతో నిరసన తెలుపుతూ, కొన్ని కుండలు పలగొట్టి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంశ్ కాళ్లు మొక్కుతూ ప్రజల తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వేడుకొన్నారు. అనంతరం వినతి పత్రం కమిషనర్ కి అందజేశారు. భాస్కర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మేడ్చల్ సర్కిల్ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఎండాకాలం ప్రారంభం కాకముందే అనేక ప్రాంతాల్లో మంచినీరు అందడం లేదని, కొన్నిచోట్ల డ్రైనేజీ కలిసిన మురుగునీరు వస్తుందని తెలిపారు. పారిశుద్ధ్య సమస్యలపై అధికారులను అడిగితే వాహనాలకు కనీసం డీజిల్ కూడా లేదని సమాధానం ఇస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు తీవ్రమైన నేటి సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు వచ్చేది అని భాస్కర్ యాదవ్ పేర్కొన్నారు. మాజీ మంత్రి ,మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జలమండలికి పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లిన స్పందన లేదన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో విలీనం చేసిన తర్వాత ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కోట్ల రూపాయల ఆస్తి పన్నులు వసూలు చేసినప్పటికీ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కిష్టాపూర్, పూడూరు డివిజన్ ప్రజలకు తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి, ఎల్లంపేట మున్సిపల్ కౌన్సిలర్ నిషిత రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఉమా నాగరాజు, బిఆర్ఎస్ నాయకులు గణేష్, వీర్ల చంద్రశేఖర్, శైలేందర్, విష్ణు చారి, ప్రభాకర్, మల్లికార్జున స్వామి, సందీప్ గౌడ్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
