BRS | జెండా మోసినోళ్లకే.. జై అనాలె!
గల్లీ నుంచి ఢిల్లీ దాకా గళమెత్తిన బీ ఆర్ ఎస్ లో గందరగోళం.
ఆ పార్టీని వెంటాడుతున్న అంతర్గత సమస్యలు, నిర్మాణ లోపాలు.
ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో, హైదరాబాద్:
BRS | దశాబ్దాల తరబడి నీళ్ల కోసం.. నిధుల కోసం, నియామకాల కోసం ఎదురు చూసిన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా మారి ప్రత్యేక తెలంగాణ వాంఛను నెరవేర్చిన ఆ పార్టీ (BRS) ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంది. అలుపెరుగని పోరాటాలతో తెలంగాణ గొంతుకగా మారి యావత్ దేశాన్ని కుదిపేసేలా నినదించిన ఉద్యమపార్టీ.
నాటి ఉద్యమ స్పూర్తిని విడిచి పెట్టిందన్న ఆవేదన ఆ పార్టీ విధేయుల నుంచే వ్యక్తమవుతోంది. పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన నేతలందరూ అధికార మార్పిడితో అస్త్రసన్యాసం చేసినట్లు కనిపిస్తోంది. సంస్థాగత లోపాలు ఆ పార్టీని పట్టి పీడిస్తున్నాయని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో(Jubleehills by polls) ఆ పార్టీ ఓటమితో అవి మరోసారి ప్రస్ఫుటమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తీవ్ర నైరాశ్యం నిస్పృహలు వెంటాడుతోన్న వేళ నియోజక వర్గం యూనిట్ గా ఇప్పటి వరకు పార్టీని నడిపించిన తీరు సరి కాదని, లీడర్లను కారు కేడర్ ను పట్టించుకోవాలని పార్టీ అధిష్టానానికి సామాజిక వేత్తలు సైతం సూచిస్తున్నారు.
పార్టీ పటిష్ట నిర్మాణానికి అడుగులు వేయాలని, గ్రామ-బూత్ (booth) స్థాయిలో పార్టీని పునర్నిర్మించుకోవాలని వారు పేర్కొంటున్నారు. ఉద్యమ పార్టీగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం వంటి సెంటిమెంట్ మీదనే ఇంకా ఆధార పడి ఉండటం సరికాదన్నది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది!
గ్రామగ్రామాన ఎగిరిన గులాబీ జెండాలు ఉద్యమ పార్టీకి ఊపిరి పోశాయి. పదేళ్ల అధికారంలో పండుగ వాతావరణంలో ఆయా గ్రామాలు గులాబీ మయంగా కనిపించాయి. కానీ, ఇదంతా రెండేళ్ల క్రితం వరకే, (TG) రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ హస్తగతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంది.
ఉద్యమపంథాతో జూబ్లీహిల్స్ ఓటమితో బీఆర్ఎస్కు విశ్లేషకుల సూచన
- లీడర్లనే కాదు.. కేడర్నూ పట్టించుకోవాలి
- పటిష్ట నిర్మాణంతోనే బీఆర్ఎస్కు మనుగడ
- పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కృషి చేయాలి
- పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం పెంచాలి
- తెలుగుదేశం పార్టీ తరహా ఫోకస్ పెట్టాల్సిందే!
- మాజీ మంత్రి కేటీఆర్ కు గులాబీ శ్రేణుల వేడుకోలు
ఏకతాటిపైకి వచ్చి సమస్యలపై ఉద్యమించాల్సిన వేళ, ఏకఛత్రాధిపత్యంతో ముందుకు సాగే నాయకుల తీరుతో ఆ పార్టీ కేడర్ తల్లడిల్లుతోంది. ముఖ్యంగా పదేళ్ల అధికారంలోనూ, ఆ తరువాత కూడా పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టకపోవడం, సగటు గులాబీ కార్యకర్త మనసులో మాటను పట్టించుకోక పోవడం ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతోందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. గత అసెంబ్లీ (Assembly Elections) ఎన్నికల్లో ఓటమికి కూడా కేడర్ను పట్టించుకోకపోవడమే కారణమని తెలుస్తుండగా, అధికారంలో ఉన్నప్పుడూ, అధికారం కోల్పోయిన తర్వాత కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే అంశాలపై గులాబీ పార్టీ పెద్దలు దృష్టి సారించలేదని, కార్యకర్తల గోడును పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కేవలం ఎమ్మెల్యేల సంఖ్యాబలం సరిపోతుందన్నట్లు ఆ పార్టీ ముఖ్యనేతలు వ్యవహరించారని, తద్వారా ప్రజలకు, కింది స్థాయి కేడరు దూరం కావాల్సి వచ్చిందని స్వయంగా పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఉద్యమ ఎజెండాతో అధికారం చేపట్టిన గులాబీ సేన.. ఉద్యమ కారులను దూరం చేసుకోవడం, బంగారు తెలంగాణ నినాదంతో వలస నేతలకు వరుస అవకాశాలు కల్పించడం పెనుదుమారానికి కారణమైంది. అంతేకాకుండా ఉద్యమకారులు, వలసనేతలకు మధ్య సమన్వయం కుదర్చక పోవడం కూడా ఆ పార్టీకి శాపంగా మారినట్లు తెలుస్తోంది.
BRS | లీడర్లను కాదు.. కేడర్ను పట్టించుకోవాలి
గులాబీ పార్టీ ముఖ్యనేతలుగా చెలామణిలో ఉన్న నియోజకవర్గ ఇన్చార్జిలు, మాజీ, తాజా ఎమ్మెల్యేలతో మాత్రమే పార్టీ అధిష్టాన పెద్దలు టచ్లో ఉంటూ, క్షేత్రస్థాయి సమస్యలను, కేడర్ ను పట్టించుకోలేదని వినిపిస్తోంది. పార్టీలోకి వలస వచ్చిన నేతలు, తెలంగాణ (TG) ఆవిర్భావం తరువాత పార్టీలోకి వచ్చిన వారంతా ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని, ఒకవేళ బీఆర్ఎస్లోనే కొనసాగినప్పటికీ, అంతంత మాత్రం పనితీరుతో పార్టీలో ఏకఛత్రాధిపత్యం వహిస్తూ, పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా అధికారంలో ఉన్న పదేళ్లలో ఏనాడూ కార్యకర్తల అభిప్రాయాలను వారు వినిపించు కోలేదని, వారివెంట వచ్చిన వలస నేతలను తప్ప, అంతకుముందు జెండామోసిన కేడర్ను పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా విబేధాలు ఉన్నప్పటికీ, అవి స్పందించే వారు లేక వెలుగు చూడలేదని తెలుస్తోంది. పార్టీ నియోజకవర్గ బాధ్యులు, ఎమ్మెల్యేలు, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలతో తప్ప, పార్టీ కార్యకర్తలు, (Cadre) గ్రామస్థాయి నాయకులకు గులాబీ అధిష్టాన పెద్దలు అందుబాటులో లేకుండా పోయారని, తమ వాయిస్ను క్షేత్రస్థాయిలో వినిపించలేదని, దీంతో కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జి లు, వారి అనుచరులు సాగించిన అక్రమాలు, అవినీతి వెలుగులోకి రాలేదని, చెప్పుకొనే అవకాశం కార్యకర్తలకు లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో ప్రజలతో పాటు, గ్రామీణ ప్రాంత నాయకులు పార్టీకి దూరమైనట్లు తెలుస్తోంది.
BRS | పటిష్ట నిర్మాణానికి అడుగులు వేస్తేనే..
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రజల నాడి
తెలిసిన లీడర్ గా, ప్రజల గొంతుకగా ఉన్నప్పటికీ, ఆయన వయస్సు, అనారోగ్య కారణాల రీత్యా, పార్టీని గ్రౌండ్ లెవల్ కు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. గ్రామస్థాయిలో పార్టీ కమిటీల నిర్మాణం, మండల స్థాయి బాధ్యులతో టచ్ లోకి వెళ్లి, పార్టీ లక్ష్యాలను, అభిప్రాయాలను క్రమం తప్పకుండా వివరించాలని వారు సూచిస్తున్నారు.
పార్టీలో శిక్షణ తరగతులు, పార్టీ కార్యక్ర మాలను విస్తృతం చేయడంతో పాటు, కేటీఆర్ స్వయంగా పర్య వేక్షించాలని వారు కోరుతున్నారు. పార్టీ జెండాను భుజాన మోసే నిజమైన కార్యకర్తలను కాపాడుకోవాలని కోరుతున్నారు. గతంలో టీడీపీ అధినేత, అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైఎస్. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరెస్ట్ చేయగా, మంత్రి నారా లోకేష్ సమస్యను వివరించి, పరిష్కారం కోరుతూ ఢిల్లీకి వెళ్లడంతో, ముఖ్య నేతలంతా YCP ప్రభుత్వంపై గొంతెత్తలేక మిన్నకుండి పోయిన వేళ, గ్రామీణ ప్రాంతాల కార్యకర్తలే స్వచ్చందంగా రోడ్లపైకి వచ్చి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోసం నినదించిన పరిస్థితిని గులాబీ శ్రేణులు ఉదహరిస్తున్నారు. నిర్మాణాన్ని అంత పకడ్బంధీగా చేపట్టాలని వారు సూచిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ తరహాలో క్షేత్రస్థాయి చంద్రబాబు అరెస్ట్ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకొచ్చి దాదాపు 164 స్థానాల్లో మహా కూటమికి విజయాన్ని కట్టబెట్టిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ నిత్యం వారికి టచ్ లో ఉండటం, పార్టీ సంక్షేమానికి, కార్యకర్తలకు సమ ప్రాధాన్యతనిచ్చి(Importance) కాపాడుకుంటూ వస్తున్నారని, కార్యకర్తలను పట్టించుకోని కారణంగానే 2020 లో తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరమైందని, తదుపరి పార్టీ కేడర్ను కాపాడుకొన్నందుకే తిరిగి అధికారం చేపట్టిందని వారు గుర్తు చేస్తున్నారు.
బీఆర్ఎస్ కూడా నైరాశ్యంలో మునిగి పోవడానికి నియోజకవర్గ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేల ఒంటెద్దు పోకడలు, పార్టీ ఆది నాయకత్వం పట్టింపు లేనితనమే కారణమని, సమస్యలను(Problems) గుర్తించి పటిష్ట నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు.
దాదాపు అరవై లక్షలకు పైగా సభ్యత్వాలు ఉన్నాయని. ఆ కేడర్ ను కనిపెట్టుకొని ఉండాలని, పార్టీ నిర్మాణంలో వారిని భాగస్వాములు చేసి, పార్టీ కార్యకలా పాల్లో వారు ముఖ్య భూమిక పోషించేలా చూడాలని, పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయాలని వారు కోరుతున్నారు.

